విశాఖ సహజసిద్ధంగానే అందమైన నగరం. ఇపుడు ఈ మెగా సిటీ సరికొత్త సొగసులు అద్దుకుంటోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది ఇదంతా దేనికి అంటే విశాఖకు వస్తున్న దేశ విదేశీ అతిధుల కోసం. విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టనర్ షిప్ సమ్మిట్-2025 ని నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయి సదస్సు. దాంతో దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశాఖలో జరిగే సమ్మిట్ కోసం గత రెండు నెలల నుంచి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారుల సుందరీకరణ నుంచి పార్కులు బీచ్ పరిసరాలు విహార స్థలాల అలంకరణ వరకూ అన్నీ సిద్ధం చేస్తున్నారు. విశాఖలో ఉన్న స్టార్ హొటళ్ళతో పాటు ప్రముఖ హొటళ్ళు అన్నీ ఈ అతి పెద్ద ఈవెంట్ కోసం రెడీ చేసి పెట్టారు. దేశ విదేశీ ప్రముఖులు బస చేసేందుకు అలాగే సాయంత్రం వేళలలో వారు విహరించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే సదస్సు ఉండడతో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
విశాఖలో ఏ భారీ సదస్సు లేదా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ నే ఎంచుకుంటారు. ఇక్కడ ఉన్న సువిశాలమైన మైదానంలోనే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి తొలివారంలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా ఇక్కడే భారీ సభను నిర్వహించారు. ఇపుడు కూడా మరోమారు ఘనమైన వేదికను ఏర్పాటు చేస్తూ సమ్మిట్ కోసం కొత్త రంగులు అద్దుతున్నారు.
ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ద్వారా ఏకంగా 410 దాకా ఒప్పందలౌ వివిధ రంగాలలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుందని చెబుతున్నారు. అంతే కాదు లక్షలలో పెట్టుబడులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఏకంగా మూడు వేల మంది అతిథులు హాజరవుతారని అంటున్నారు. దాంతో ఈ భారీ సమ్మిట్ ని సక్సెస్ ఫుల్ గా చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రమిస్తోంది.
ఈసారి జరిగే సమ్మిట్ పాత్ర ట్రెండ్ కి చెక్ పెడుతూ సాగబోతోంది అని అంటున్నారు. దావోస్ లో నిర్వహించిన తీరులోనే ఈ సదస్సు జరుగుతుందని చెబుతున్నారు. బిగ్ డిబేట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఏ విధంగా ఏపీకి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు, దానికి తగినట్లుగా పెట్టుబడులు ఏ ఏ ఫీల్డ్స్ లో పెట్టవచ్చు, దాని ద్వారా రానున్న రోజుల్లో ఏపీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది కూడా ఈ డిబేట్స్ నుంచి వచ్చే అవుట్ పుట్ గా చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే కేవలం పెట్టుబడుల ఒప్పందాలకే కాకుండా ఏపీ టోటల్ ఫ్యూచర్ ని ఉద్దేశించి ఒక బ్లూ ప్రింట్ ని రూపొందించే కీలక సదస్సుగా విశాఖలో జరిగే సమ్మిట్ 2025 నిలిచిపోతుందని అంటున్నారు.


















