పాకిస్థాన్ – ఆఫ్గనిస్థాన్ మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైనికులు, సామాన్య ప్రజలు మృతి చెందారు, తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టర్కీ, ఖతర్ లు ఈ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించాయి. ఈ క్రమంలో ఈ నెల 6, 7 తేదీలలో ఇస్తాంబుల్ వేదికగా చర్చలు జరిగాయి.
అయితే… ఈ చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. దీనిపై నవంబర్ 8న జబీహుల్లా ముజాహిద్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్గన్ సహనాన్ని పరీక్షించొద్దంటూ పాకిస్థాన్ కు తాలిబన్ ప్రభుత్వం నుంచి స్ట్రాంగ్ హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలు పాకిస్థాన్ ధమ్ముకు పెద్ద పరీక్షే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా… టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినప్పటికీ.. పాకిస్తాన్ పురోగతిని అడ్డుకుంటుందని, పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముందుగా టర్కీ, ఖతర్ దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది.
అనంతరం… నవంబర్ 6, 7 తేదీలలో జరిగిన చర్చలకు ఆఫ్గన్ ప్రతినిధులు మంచి విశ్వాసంతో హాజరయ్యారని.. కానీ, పాక్ మాత్రం మరోసారి తన బాధ్యతారాహిత్య, సహకారేతర వైఖరిని ప్రదర్శించిందని తెలిపింది. తన భద్రతకు సంబంధించిన అన్ని బాధ్యతలను ఆఫ్గాన్ ప్రభుత్వానికి సూచించాలని కోరుతోన్న పాక్.. ఆఫ్గాన్ భద్రతకు బాధ్యతను స్వీకరించడానికి మాత్రం సుముఖత చూపడం లేదని వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన ఆఫ్గాన్ తెగలు, సరిహద్దులు, గిరిజన వ్యవహారాల మంత్రి నూరుల్లా నూరి.. “ఆఫ్గన్ల సహనాన్ని పరీక్షించొద్దు” అంటూ పాకిస్థాన్ అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధం ప్రారంభమైతే.. ఆఫ్గాన్ పెద్దలు, యువత ఇద్దరూ పోరాడటానికి లేస్తారని అన్నారు. ఇదే సమయంలో.. తన దేశం సాంకేతికతపై అతిగా నమ్మకం ఉంచొకొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ను నూరుల్లా నూరి హెచ్చరించారు.
ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా ఈ నెల 6న మాట్లాడిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. తాలిబాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. శాంతిచర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి మరింత దిగజారుతుందని.. తమవద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని.. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుందని అన్నారు.
ఓ పక్క శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం జరిగి తీరుతుందని పాక్ రక్షణ మంత్రి చెప్పడం.. మరో వైపు, తమ సహనాన్ని పరీక్షించొద్దని ఆఫ్గాన్ మంత్రి పాక్ అధికారులకు ఘాటు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో… ఈ ఇరు దేశాల మధ్య ఎలాంటి వాతావరణం నెలకొనబోతోందనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో ఆఫ్గన్ అప్రమత్తంగా ఉంటూ, పాక్ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని అంటున్నారు.


















