టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని నిరూపించుకుంటున్నారు. బాబు గత పాలన కంటే ఈసారి మరింత ఎక్కువగా పేదల విషయంలో ఆలోచిస్తున్నారు. ఆయన అనుభవం వయసు అన్నీ కలిసి ఆయన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పీ 4 పేరుతో పేదరిక నిర్మూలనకు బాబు కంకణం కట్టుకున్నారు. నిజంగా ఇది ఒక స్పూర్తివంతమైన కార్యక్రమంగా చూడాలి. డబ్బున్న వారు పేదలకు సాయం చేయాలన్నది ఇందులో ఉన్న సందేశం. దానికి ఒక వేదికగా పీ4 ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సంధాన కర్తగా ఉంటుంది. అటు బంగారు కుటుంబాలు ఉంటాయి. వారిని దత్తత తీసుకునే మార్గదర్శకులుగా ధనవంతులు ఉంటారు.
అయితే ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా ప్రతీ నియోజకవర్గం వారీగా పెద్ద సంఖ్యలో మార్గదర్శులను గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. అలాగే పేదరికం దిగువన ఉన్న కుటుంబాలను సర్వే చేసి గుర్తించారు. అలా మొదటి దశలో కొన్ని కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక దీని మీద తాజాగా చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన నిర్ణయ తీసుకున్నారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టుగా చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. పేదరికంపై చేస్తున్న సమరంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని చంద్రబాబు చెప్పడం విశేషం.
చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అందరిలో చైతన్యం నింపేలా ఉందని అంటున్నారు. అంతే కాదు మరింత మంది సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహద పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు. చాలా పేద కుటుంబాలను వారు దత్తత తీసుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.
ఇపుడు చంద్రబాబు కూడా ముందుకు రావడంతో ఆయన మంత్రులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు మొత్తం మార్గదర్శులుగా ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో పాటు ఆయా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున సంపన్నులు కూడా ఈ కార్యక్రమానికి చేయూతను ఇచ్చేందుకు మార్గం సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు దత్తత తీసుకుంటాను అని ప్రకటించడం మంచి పరిణామంగా చూస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో పేద కుటుంబాలను దత్తత తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం తరఫున అనేక మంది సాయం చేసి ఉండవచ్చు. కానీ తాముగా తమ సొంత నిధులతో పేదలను ముందుకు తీసుకుని వెళ్ళేందుకు అయితే సంకల్పించలేదు అని అంటున్నారు. ఇక చెప్పాలంటే పీ4 కార్యక్రమం చంద్రబాబు మానసపుత్రిక గా పేర్కొంటారు. బాబు అత్యంత పట్టుదలతో ఈ కార్యక్రమాని రూపొందించారు.
ఇది కనుక సక్సెస్ అయితే ఏపీలో పేదరికం బాగా తగ్గుతుంది. అదే సమయంలో దేశానికి ఆదర్శంగా ఉండి మిగిలిన వారు కూడా అనుసరించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అని అంటున్నారు. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్న వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని కూడా చంద్రబాబు అధికారులకు సూచిస్తున్నారు. ఇందుకోసం ఏపీ ఎన్నార్టీ సొసైటీ సాయం తీసుకోవాలని చెప్పారు. అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్ల దేనని స్పష్టం చేశారు. మరో వైపు చూస్తే పీ4 కార్యక్రమం కోసం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని కూడా చంద్రబాబు కోరుతున్నారు. పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్ర స్థాయిలో దాతలు ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చునని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే పీ4 కార్యక్రమం విజయవంతం అయ్యేలా బాబు సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నారు. పేదలు ఈ కార్యక్రమం ద్వారా బాగుపడతారు అన్నది నిజం. అ ఘనత అయితే కచ్చితంగా బాబు ఖాతాలోనే వేయాల్సి ఉంటుంది.