ఏపీలో రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రంలో లేని విధంగా అధికార పక్షం ప్రతిపక్షం కనీసంగా ముఖా ముఖాలు చూసుకోలేని స్థితి సాగుతోంది. రెండు పక్షాలు కలిసేది అసలైన వేదిక అసెంబ్లీగా ఉంటుంది. అయితే అక్కడికి వైసీపీ వెళ్ళడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన వారు ఇవ్వడం లేదు అని జగన్ ఆరోపిస్తున్నారు. ఏకైక విపక్షానికి హోదా ఇస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు వినే ఓపిక తీరిక వారికి లేదని జగన్ అంటున్నారు.
కేవలం ఎమ్మెల్యేగానే చూస్తామని రెండు నిముషాలు మాత్రమే మాట్లాడేందుకు కేటాయిస్తామని అంటున్నారు అని అలాంటపుడు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని తాడేపల్లిలో జరిగిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ చెప్పుకొచ్చారు. ఒక ఇష్యూ మీద మాట్లాడాలి అంటే కనీసంగా అరగంట పైగా అవుతుందని అలాంటిది కూటమి హయాంలో జరిగిన తప్పుల గురించి ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందుల గురించి మాట్లాడేందుకు ఎంతో సమయం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అయితే సమయం ఇచ్చేది లేదు అన్నట్లుగా కూటమి పెద్దల వైఖరి ఉందని జగన్ విమర్శించారు. మేమే కొడతాం, మేమే ఏడుస్తామన్నట్లుగా వారే సభలో అటూ ఇటూ మాట్లాడుకుంటూ డబుల్ యాక్షన్ చేస్తారు కానీ విపక్షం గొంతు వినాలని వారికి అయితే లేదని జగన్ తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీట్ లో అన్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో బాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చాలా మంది తనకు సలహా ఇచ్చారని జగన్ చెప్పడం విశేషం. కొందరిని అటు నుంచి ఈ వైపు లాగేస్తే ఆయనకు విపక్ష హోదా ఉండదని అన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే తాను మాత్రం ప్రతిపక్ష నేతగా ఆయన హోదాకు ఇబ్బంది లేకుండా చూడడమే కాదు వారి వైపు నుంచి అవకాశాలు ఇచ్చామని చెప్పారు. ఆనాడే తలచుకుంటే ప్రతిపక్షం గొంతు వినే చాస్ ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. తాము అలా చేయలేదని కానీ ఇపుడు కూటమి మాత్రం విపక్షాన్ని లెక్క చేయడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీకి శాసనమండలిలో మంచి బలం ఉందని జగన్ అంటూ ఇక మీద మండలిలో మరింత గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీద మండలి వేదికగా ఎండగట్టాలని ఏ ఇష్యూని వదలకూడదని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం అయితే జనాలలో ఉందని జగన్ అన్నారు కీలక రంగాలు అయిన విద్య వైద్యం వ్యవసాయం వంటి వాటి మీదనే ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన విమర్శించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతోంది అని జగన్ అన్నారు. ఏ వైపు చూసినా దోపిడీ సాగుతోందని హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ మండలిలో ఎమ్మెల్సీలు ఎలుగెత్తి చాటాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జగన్ దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో తమ పోరాట పటిమ చూపించాల్సి ఉందని వారి మీదనే ఎక్కువ బాధ్యత ఉందని జగన్ గట్టిగా చెప్పారు.
ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సభ జరిగే తీరుని గమనించి ప్రతీ అంశం మీద మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికపుడు ఎండగట్టాలని ఆ విధంగా మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ మధ్యలో తాను కూడా మీడియా ముందుకు వచ్చి కీలక అంశాల మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద జనం దృష్టికి తెస్తాను అని జగన్ అన్నారు. దీంతో ఎమ్మెల్యేలకు జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. జగన్ కాకుండా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా ఇక మీదట ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల మీద తమదైన శైలిలో విమర్శలు చేయాలని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో జగన్ వారి పనితీరుని ఎలా బేరీజు వేస్తారో.