పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా… మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది.. మెరుపు దాడులు చేసింది.
ఈ ఘటనలో 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేయగా.. సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో… తమకు న్యాయం జరిగిందంటూ పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలు తెలిపాయి! ఇదే సమయంలో… పాక్ లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన దాడులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి.
అవును… పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైనిక చర్యలకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ దాడులు త్వరగా ముసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు శక్తివంతమైన దేశాలు ఇలా రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని.. భారత్, పాక్ కు ఎంతో చరిత్ర ఉందని ట్రంప్ తెలిపారు.
మరోవైపు పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్… అమెరికా సలహాదారు మార్క్ రూబియోతో మాట్లాడారు. ఈ దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులు పాక్ పౌరులు, సైనిక స్థావరాలపై చేయలేదని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడిపై ఇజ్రాయేల్ స్పందించింది. ఇందులో భాగంగా… ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది.. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి.. ఈ విషయంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్.
ఇదే సమయంలో… ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ స్పందించారు. ఇందులో భాగంగా… ఇరు దేశాల సైనికులు సంయమనం పాటించాలని అన్నారు. ఇదే క్రమంలో యూఏఈ ఉపప్రధాని షేక్ అబ్ధుల్ బిన్ జాయెద్ స్పందిస్తూ.. భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదని.. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అన్నారు.
పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి అత్యంత కిరాతకంగా ప్రదర్శించింది. భారత సైన్యం కేవలం సరిహద్దులోని ఉగ్రవాద స్థావరాలపై, వారి లాంచ్‌పాడ్‌లపై లక్షిత దాడులు నిర్వహించి, దేశ భద్రతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, దానికి ప్రతీకారంగా పాక్ సైన్యం నీచమైన చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న అమాయక భారతీయ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్‌లోని పౌర గ్రామాలపై పాక్ రేంజర్లు విచక్షణారహితంగా ఫిరంగులు, మోర్టార్లతో భీకర దాడులకు పాల్పడుతున్నారు.
ఈ అకస్మాత్తు దాడులు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా తంగ్డర్ సెక్టార్‌లోని ఓ గ్రామంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పాక్ షెల్లింగ్ తీవ్రతకు ఒక కశ్మీరీ పౌరుడి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు దుర్మరణం పాలవడం పాక్ అకృత్యానికి నిదర్శనం. అనేక మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.
పాకిస్తాన్ పాల్పడుతున్న ఈ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, ఎటువంటి రెచ్చగొట్టకపోయినా భారత పౌర లక్ష్యాలను చేసుకుని దాడులు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ, వారి స్థావరాలపై భారత సైన్యం చర్యలు తీసుకుంటే, అమాయక పౌరులపై దాడులకు తెగబడటం దాని పిరికితనాన్ని, నీచబుద్ధిని తెలియజేస్తుంది.
భారత సైన్యం పాక్ కాల్పులను అత్యంత సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ రేంజర్ల దుశ్చర్యలకు ధీటుగా బదులిస్తూ, సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, పాకిస్తాన్ తీరు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిరంతరం షెల్లింగ్ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చాల్సిన దుస్థితి ఏర్పడింది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మానవతా విలువలను కాలరాసేలా పాకిస్తాన్ పాల్పడుతున్న ఈ దుశ్చర్యల పట్ల అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని భారత్ గట్టిగా కోరుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించే పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించాలని, తగిన చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిస్తోంది. అమాయక పౌరులపై దాడులకు పాల్పడే పాకిస్తాన్ చర్యలు ప్రాంతీయ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి.