స్నేహాన్ని నమ్మి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన నిజాంపేటలో చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన 20 ఏళ్ల బయోమెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, అతని మరో మిత్రుడు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారువివరాల్లోకి వెళితే… బాధితురాలు చెన్నైలో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని ఆమె స్నేహితుడైన అజయ్ నమ్మబలకడంతో ఆమె నగరానికి వచ్చింది. నగరానికి వచ్చిన యువతి కూకట్‌పల్లిలోని ఓ మహిళా హాస్టల్‌లో నివాసం ఉంటోంది.
కొన్ని రోజుల క్రితం, అజయ్ తన స్నేహితుడైన హరి ఫ్లాట్‌లో పార్టీ ఉందని బాధితురాలిని ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపు కావడంతో నమ్మిన యువతి, నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న హరి ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత, అజయ్, హరి కలిసి యువతిని బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత, అజయ్ , హరి ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ దారుణమైన బాధాకరమైన సంఘటన జరిగిన తర్వాత తేరుకున్న బాధితురాలు ధైర్యం కూడగట్టుకుని బచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన అజయ్, హరి కోసం గాలిస్తున్నారు.
స్నేహం ముసుగులో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం, నమ్మిన స్నేహితులే కాలయముళ్లుగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే నిజాంపేట వంటి జనసమ్మర్థ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.