నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక విశేష ఘట్టం రానుంది. అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 అద్భుత విజయాన్ని సాధించడంతో, ఆ పార్టీ నాయకుడు రాబ్ జెట్టెన్ దేశానికి కొత్త ప్రధానమంత్రి కానున్నారు. 38 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టబోతున్న జెట్టెన్, నెదర్లాండ్స్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు, తొలి బహిరంగ స్వలింగ సంపర్కుడు (Openly Gay Prime Minister)గా నిలవనున్నారు.
ఈసారి నెదర్లాండ్స్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. వలస వ్యతిరేకత, మత అసహనం వంటి అంశాలతో ప్రచారం చేసిన గీర్ట్ వైల్డర్స్‌పై జెట్టెన్ ఘన విజయం సాధించాడు. ప్రజల్లో వైల్డర్స్‌కి ఉన్న పాత ప్రజాదరణ తగ్గిపోగా, జెట్టెన్ సానుకూల సందేశాలతో యువతను, మధ్యతరగతిని ఆకట్టుకున్నాడు. విదేశాల్లో నివసించే డచ్ పౌరుల ఓట్ల లెక్కింపు నవంబర్ 3న పూర్తికానున్నప్పటికీ, D66 పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.రెండేళ్ల క్రితం ఐదవ స్థానంలో ఉన్న D66 పార్టీని ఈ స్థాయికి చేర్చడంలో జెట్టెన్ వ్యూహం కీలకమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నినాదం “Yes We Can” నుండి ప్రేరణ పొంది, ఆయన ఈ ఎన్నికల్లో “ఇది సాధ్యమే” అనే నినాదాన్ని తీసుకున్నారు.
జెట్టెన్ మాట్లాడుతూ “వైల్డర్స్ సమాజంలో ద్వేషాన్ని, విభజనను పెంచాలని చూస్తున్నారు. కానీ మేము ప్రజలకు సానుకూలత, ఐక్యత అనే సందేశం ఇచ్చాము. ఇది యూరప్ మొత్తానికి ప్రేరణగా నిలుస్తుంది” అని అన్నారు.జట్టెన్ తన నాయకత్వంలో నెదర్లాండ్స్‌కి యూరోపియన్ యూనియన్‌తో బలమైన సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. “యూరప్ మద్దతు లేకుండా మనం శూన్యం. అందువల్ల మన దేశం తిరిగి యూరప్ మధ్యలో ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్‌లోని ఉడెన్ నగరంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. నీమెయర్‌లోని రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయంలో ప్రజా పరిపాలనలో విద్యనభ్యసించారు. చిన్నతనంలో ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడలంటే ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది.
తన జీవితంపై మాట్లాడుతూ జెట్టెన్ “చిన్ననాటి నుంచీ ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా మార్చాలని నా కోరిక. తొలుత నేను క్రీడలలో లేదా రెస్టారెంట్ వ్యాపారంలో కెరీర్ చేయాలనుకున్నాను. కానీ జీవితం నన్ను వేరే దారిలో నడిపించింది. ఇప్పుడు నా దేశానికి సేవ చేయడం నా అదృష్టం.” అంటూ పేర్కొన్నారు.రాబ్ జెట్టెన్, అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్ కీనన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ వచ్చే ఏడాది స్పెయిన్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ జంటకు నెదర్లాండ్స్ ప్రజలు విస్తృతంగా మద్దతు ఇస్తున్నారు.
రాబ్ జెట్టెన్ విజయం కేవలం ఒక పార్టీ విజయమే కాదు.. అది సహనానికి, సమానత్వానికి, సానుకూలతకు సంకేతం. రాజకీయాల్లో విభజన, ద్వేషం పెరుగుతున్న ఈ కాలంలో ఆయన విజయం ప్రపంచానికి ఒక కొత్త దిశను చూపుతోంది.నెదర్లాండ్స్ ఇప్పుడు ప్రపంచానికి చెబుతోంది.. “ఇది సాధ్యమే!” అని..
















