కార్లు, కాన్వాయ్… వెనుక అనుచరులు… అభిమానులు… ఏ దేశంలో అయినా మంత్రులు అంటే హంగు ఆర్భాటం.. డాబు దర్పం ఉంటాయి… ఎంత పేద దేశమైనా కాస్తయినా ఇది సహజం… నేపాల్ లోనూ మొన్నటి వరకు ఇంతే..! కానీ.. ఐదు రోజుల వ్యవధిలో వారి జీవితం అంతా మారిపోయింది…. సోషల్ మీడియాపై విధించిన నిషేధం చివరకు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దారితీసింది. ప్రధానమంత్రి కూడా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా బయటకు వస్తున్న వీడియోల ప్రకారం… నేపాల్ లో మంత్రులు సైతం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రాణాలు అరచేత పట్టుకుని పరార్..
నాలుగేళ్ల కిందట అఫ్ఘానిస్తాన్ లో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… మూడేళ్ల కిందట శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే.. ఏడాది కిందట బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా.. ఇలా వరుసగా ప్రభుత్వాలు పడిపోయిన సందర్భంలో వారంతా విదేశాలకు వెళ్లిపోయారు. నేపాల్ లో ఓలీ కూడా ఇలానే వెళ్లిపోయినట్లు కథనాలు వచ్చినా ఆయన అక్కడే ఉన్నట్లు తేలింది. అయితే, నేపాల్ మంత్రులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టం అవుతోంది. ఆందోళనకారుల నుంచి తప్పించుకునేందుకు వీరంతా హెలికాప్టర్ తాడు (రోప్) పట్టుకుని బతుకుజీవుడా అంటూ బయటపడినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఉన్నతాధికారులు కూడా ఇలానే ప్రాణాలు దక్కించుకున్నట్లు కనిపిస్తోంది.
విదేశాంగ మంత్రి మొహం పగిలిపోయింది…
ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో ప్రకారం.. నేపాల్ విదేశాంగ మంత్రి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా ఆందోళనకారుల చేతిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 4న ఆమె అమెరికా అందించిన రెండు విమానాలను ప్రారంభించారు. ఆ సమయంలో చక్కటి వస్త్రధారణతో, మేకప్ తో కనిపించారు. ఈ నెల 9న ఆమెపై దాడి జరిగిన తర్వాత తీసిన ఫొటోలో రక్తపు గాయాలతో జుట్టంతా చెదిరిపోయి ఉన్నారు. అర్జు మొహంపై తీవ్రంగా కొట్టడంతో వాచిపోయిందని తెలుస్తోంది. కాగా, ఈమె ఎవరో కాదు.. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా భార్య. ఆయనపైనా దాడి జరిగింది. అర్జు ఫొటోలు చూసినవారు నాలుగు రోజుల్లోనే జీవితం ఎంత మారిపోయింది..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
















