నేపాల్‌లో భీకర ఆందోళనల తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు, హింస చెలరేగాయి. హింసాత్మక ఘటనలతో ఖఆట్మాండులో విధ్వంసం, మరణాలు, అగ్నిప్రమాదాలకు సంబంధించిన భయంకరమైన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల ఆందోళనల కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు హిమాలయ దేశంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే బాధ్యతను నేపాల్ సైన్యం చేపట్టింది. ఈ క్రమంలో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఆందోళనకారులకు, ప్రజలకు సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. విధ్వంసం, దోపిడీ, లేదా వ్యక్తులపై దాడులు వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
నేపాల్ సంక్షోభంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి సైనిక దళాల చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్. శాంతియుత మార్గం కోసం చర్చలకు రావాలని ఆయన ఆందోళనకారులకు పిలుపునిచ్చారు.గత ఏడాది సైనిక దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టిన 58 ఏళ్ల జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్.. మంగళవారం రాత్రి టీవీలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.“ప్రస్తుత నిరసన కార్యక్రమాలను ఆపి, శాంతియుత మార్గం కోసం చర్చలకు ముందుకు రావాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలి. మన చారిత్రక, జాతీయ వారసత్వాన్ని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను కాపాడాలి. ప్రజలకు, దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలి,” అని ఆయన అన్నారు.
“నేపాల్ చరిత్ర ప్రారంభం నుంచి, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేపాల్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వేచ్ఛ, జాతీయ ఐక్యత, నేపాలీ ప్రజల భద్రతను కాపాడటానికి నేపాల్ సైన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది,” అని ఆయన అన్నారు.“కొంతమంది వ్యక్తులు క్లిష్ట పరిస్థితులను అడ్డుపెట్టుకొని సాధారణ పౌరులకు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు,” అని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
నేపాల్‌లో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే అంబులెన్సులు, శవపేటికలను తీసుకువెళ్లే వాహనాల వంటి అత్యవసర సేవలకు చెందిన వాహనాలకు అనుమతి ఇచ్చారు.“నిరసనల పేరుతో ఏ విధమైన నిరసనలు, విధ్వంసం, దోపిడీ, అగ్నిప్రమాదాలు, వ్యక్తులు, ఆస్తులపై దాడులు చేస్తే వాటిని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు, భద్రతా సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంటారు,” అని సైన్యం పేర్కొంది.
పౌరులు, మీడియా ప్రతినిధులు కూడా పుకార్లను పట్టించుకోకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.“వివిధ అసాంఘిక వ్యక్తులు ఆందోళనల పేరుతో వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, అగ్నిప్రమాదాలు, దోపిడీ, వ్యక్తులపై హింసాత్మక దాడులు, అత్యాచార ప్రయత్నాలు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు” అని ప్రకటనలో సైన్యం పేర్కొంది.నేపాల్‌లో గత రెండు రోజులుగా తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళన, అవినీతి, పారదర్శకత లేకపోవడానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమంగా మారింది. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ఆందోళనలను అణచివేయాలని ప్రయత్నించింది.
పోలీసుల చర్యలో 19 మంది నిరసనకారులు మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమై, పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. తాము ‘జెన్ జెడ్’ (Gen Z) అని చెప్పుకుంటున్న ఆందోళనకారులు రాజకీయ నాయకుల విలాసవంతమైన జీవనశైలికి, నేపాల్ ప్రజల జీవన పరిస్థితులకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని ఎత్తిచూపారు.నిరసనకారుల్లో ఒక వర్గం ప్రభుత్వ భవనాలను, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మొదట రాజీనామా చేయడానికి నిరాకరించిన కేపీ శర్మ ఓలి, ఆందోళనకారులు చర్చలకు నిరాకరించడంతో మంగళవారం రిజైన్ చేశారు.
కాగా నిరసనకారులు శృతి మీరి, రాజకీయ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే నేపాల్ మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటిపై దాడి చేశారు. ఇంటికి నిప్పటించారు. లోపల ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ మంటల్లో చిక్కుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించడానికి అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఈ రోజు ఆందోళనకారుల బృందంతో సమావేశం కానున్నారు.స్థానిక మీడియా నివేదికల ప్రకారం, “అందరూ ప్రశాంతంగా ఉండాలని, దేశానికి మరింత నష్టం జరగకుండా నిరోధించాలని, చర్చలకు ముందుకు రావాలని నేను అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో, పౌరులు లేవనెత్తే డిమాండ్‌లను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించవచ్చు,” అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఖాట్మాండు విమానాశ్రయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం అయిన సింగ్‌దుర్భార్ వంటి కీలక ప్రదేశాలలో సైన్యం భద్రతను తమ ఆధీనంలోకి తీసుకుంది. సరిహద్దులను మూసివేశారు.