కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అప్రతిహత విజయాలతో దూసుకుని పోతోంది. 2024లో అధికారంలోకి మూడవసారి వరసగా వచ్చింది. ఆ తరువాత కేవలం పద్దెనిమిది నెలలల పాలనలో దేశంలో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ తాజాగా బీహార్ ఇలా ఫలితాలు అన్నీ ఎన్డీయేకు అనుకూలంగా రావడంతో ఆనందానికి అవధులు లేవు. ఇక ఎన్డీయేలో ముగ్గురు మిత్రుల బంధం మరింతగా ఈ విజయాలతో బలపడుతోంది. ఆ ముగ్గురు మిత్రులు ఎవరూ ఏమా కధ అంటే వెరీ ఇంట్రెస్టింగ్.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ముగ్గురూ మంచి మిత్రులు. పైగా సమ వయస్కులు. వీరంతా ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఇక వీరి రాజకీయ జీవితం సైతం దశాబ్దాలుగా ఉంది. ఇక ఈ ముగ్గురి మధ్య గతంలో కొన్ని పొరపొచ్చాలు వచ్చినా ఇపుడు వచ్చే చాన్సే లేదు అని అంటున్నారు. నానాటికీ ఈ బంధం మరింతగా పటిష్టం అవుతోంది అని విశ్లేషిస్తున్నారు.
టీడీపీ 2018లో ఎన్డీయేని వీడి 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది అది ఒక చేదు అనుభవం. ఓటమి చెందగానే దానిని టీడీపీ అధినాయకత్వం గ్రహించింది. తిరిగి సరిచేసుకుంది. బీజేపీ జట్టులోకి ఎట్టకేలకు చేరగలింది. 2024 ఎన్నికల్లో వాటి అద్భుత ఫల్లితాను కూడా అందుకుంది. ఇపుడు టీడీపీ బీజేపీని వీడిపోవడం అన్నది కలలో కూడా చేసేది లేదని అంటున్నారు. బాబు అయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత చేసిన వ్యాఖ్యలు మోడీ పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని నమ్మకాన్ని తెలియచేసేలా ఉన్నాయి. దేశంలో ఇప్పటిదాకా మోడీ అంత ప్రజదరణ ఉన్న నాయకుడు ఎవరూ లేరని చాలా గొప్పగా చెప్పారు. ఇక 2029 ఎన్నికల్లో మోడీ బాబు జోడీ వెరీ సక్సెస్ ఫుల్ గా సాగడం ఖాయమని అంటున్నారు.
మరో వైపు చూస్తే నితీష్ కుమార్ కూడా బీహార్ లో ఒకసారి మోడీని ఎన్డీయేని విడిచి దూరం జరిగారు. ఆయన 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. కానీ 2022 ప్రాంతంలో మాత్రం బీజేపీని వదిలేసి ఆర్జేడీతో చేరిపోయారు ఆ సమయంలోనే ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇండియా కూటమిలో తనకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో పాటు మోడీ చరిష్మాను చూసిన మీదట నితీష్ మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన అన్న మాట ఏంటి అంటే మోడీతోనే ఎప్పటికీ జట్టు. ఇదే నా ఒట్టు అని. ఇక తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలసి జేడీయూ పోటీ చేసి గతంలో ఎన్నడూ సాధించని సీట్లు సాధించింది. దీంతో నితీష్ కుమార్ కూడా ఫుల్ హ్యాపీ. మోడీని ఆయన ఎంతో ఆరాధన భావంతో పాటు ఒక ప్రియమైన స్నేహితుడిగా చూస్తూ వస్తున్నారు. దానికి గతంలో ఇద్దరూ బీహార్ లో పాల్గొన్న సభలే ఉదాహరణ. మోడీ ప్రసంగిస్తూంటే చప్పట్లు కొట్టమని జనాలను కోరడమే కాదు మోడీ కనిపిస్తే చాలు గురూజీ అంటూ ఏకంగా సాష్టాంగ ప్రణామాలే చేస్తూ వస్తున్నారు.
ఇక నరేంద్ర మోడీ అయితే నితీష్ ని తన ముఖ్య స్నేహితుడిగా భావిస్తూ ఆయనను ఆలింగనం చేసుకుంటూ తన స్నేహ బంధం ఎంత గొప్పదో తెలియచేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయనకు ఎంతో గౌరవం మర్యాద ఇస్తూనే తమ మిత్రుత్వాన్ని చాటుతున్నారు. సీనియర్ నేత బాబు అని ఏపీలో పలు వేదికల మీద మోడీ చెప్పిన మాట ఆయన గుండె లోతుల్లో నుంచి వచ్చినదే. మొత్తం మీద ఈ ముగ్గురు స్నేహితులూ ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకున్నారు. తిరిగి కలుసుకున్న తరువాత ఈ స్నేహ బంధం శాశ్వతం అని గట్టిగా చెప్పుకుంటూ ముందుకు కదులుతున్నారు. రాజకీయంగా ఎన్నో చూసిన ఈ మిత్ర త్రయం తమ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తారని అంతా అనుకుంటున్న మాట. ఈ ముగ్గురూ వారి వ్యూహాలు చాణక్యాలు కనుక కలసి ఉంటే మాత్రం ప్రత్యర్ధులకు చుక్కలే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.


















