భారతీయ జనతా పార్టీలో సంస్థాగతమైన కదలిక మొదలైంది. పార్టీ పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. పార్టీకి కొత్తగా జాతీయ అధ్యక్షుడు ఎన్నిక అన్నది ఉంది. దానికి సంబంధించి ఒక వైపు కసరత్తు ప్రారంభం అయింది. ఈ లోగా బీజేపీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు చెందిన సీనియర్ నేత నితిన్ నబిన్‌ను (Nitin Nabin) పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానియమించింది. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న నితిన్ నబిన్ బంకిపూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కలిగిన నాయకుడు. దాంతో ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ప్రకటించింది.
పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రాల మధ్య సమన్వయం, కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతలను నితిన్ నబిన్ సమర్థంగా నిర్వర్తిస్తారని బీజేపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నితిన్ నబిన్‌ను అభినందించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో చేసిన పోస్టులో మోడీ నితిన్ నబిన్ పార్టీకి కష్టపడి పనిచేసే నాయకుడిగా నిలిచారు అని కొనియాడరు. నబిన్ గొప్ప సంస్థాగత అనుభవం కలిగిన యువ నేతగా, కష్టించి పనిచేసే తత్వం కలిగిన నాయకుడుగా పేర్కొన్నారు. బీహార్‌లో ఎమ్మెల్యేగా మంత్రిగా అనేకసార్లు అద్భుతమైన విజయాలను సాధించారని మోడీ గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్నారని మోడీ చెప్పుకొచ్చారు. నబిన్ శక్తి సామర్ధ్యాలు అంకితభావం రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేస్తాయని నరేంద్ర మోడీ దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అది కూడా బంపర్ విక్టరీ కొట్టింది. మిత్రపక్షం జేడీయూతో కలసి బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇపుడు అదే రాష్ట్రానికి చెందిన నితిన్ నబిన్ కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పట్టం కట్టింది. రానున్న రోజులలో ఉత్తరాదిన పార్టీని మరింతగా బలోపేతం చేసే క్రమంలో ఇది కీలక నిర్ణయంగా అంతా భావిస్తున్నారు.
















