ఇల్లు దాటి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి చేరుతామో లేదో తెలియని పరిస్థితి…! ఇది ఇప్పుడే కాదు కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట..! తాజాగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే సరిగా చెప్పారు కదా..? అని అనిపిస్తోంది. గత నెలలో కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ఘోర ప్రమాదం… సోమవారం చేవెళ్ల వద్ద జరిగిన దుర్ఘటనలను తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది..! ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటివి పెను ప్రమాదాలు సహజంగా మారాయి. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలతో రంగంలోకి దిగుతోంది. అయితే, ఈ చర్యలు జాతీయ రహదారుల పైన ఘటనలకు మాత్రమే వర్తిస్తాయి. తాజాగా కేంద్రం ఆలోచన మేరకు..
నిర్మించు.. నిర్వహించు.. బదిలీ చేయి (బీవోటీ) విధానంలో చేపట్టే రహదారుల విషయమై నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలోని కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా బీవోటీ అంటే కాంట్రాక్టర్లు నిర్మిస్తుంటారు. వీరు కాంట్రాక్టు చేసిన రహదారిపై 500 మీటర్ల పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లకు రూ.25 లక్షల ఫైన్ విధిస్తారు. ఇది మొదటి ఏడాదికే. తదుపరి ఏడాదిలో కూడా ప్రమాదం జరిగితే.. ఫైన్ ను రూ.50 లక్షలకు పెంచుతారు.
బీవోటీ పద్ధతిలో చేపట్టే రహదారులపై కాంట్రాక్టు సంస్థ 15 నుంచి 20 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. అందుకనే వాటిపై ప్రమాదాలు జరగకుండా చూడాల్సినది వారే. కేంద్రం కొత్త ఆలోచన కాంట్రాక్టు సంస్థల్లో జవాబుదారీతనం పెంచుతుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 3,500 చోట్ల ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్రం పేర్కొంటోంది. కాగా, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ నగదు రహిత చికిత్స పథకాన్ని మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రమాదం అనంతరం వారం పాటు ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.లక్షన్నర వరకు సాయం చేస్తారు.


















