రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దిశా నిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు సైతం తరచుగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అయితే తొలి రెండు మూడు మాసాలు ఈ ప్రజా దర్బార్ను విస్తృతంగా నిర్వహించిన నాయకులు ఆ తర్వాత దీనిని విస్మరించడం ప్రారంభించారు.
ఎవరికి వారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ బిజీ అనే నెపంతో దీనిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అసలు నాయకులు ఎందుకు ప్రజా దర్బార్ కు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దానిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందని ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తే ఇంకా కార్యక్రమాలు చేపట్టి కూడా ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే అసలు ప్రజా దర్బార్ అర్థం ఏమిటి? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి రాజకీయ ప్రయోజనం ఏమిటి అనేది అసలు నాయకులు ఆలోచించడం లేదన్నది వాస్తవం. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలకు అనేక సమస్యలు ఉంటునే ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఇలా అనేక రూపాల్లో ప్రజలకు సమస్యలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి చెరువగా ఉండి వారి సమస్యలు ఆలకించి పరిష్కరిస్తే ఆ ప్రభావం ఎన్నికల సమయంలో విస్తృతంగా ఉంటుందన్నది మంత్రి నారా లోకేష్ ఆలోచన.
ఆయన చేసిన యువగళం పాదయాత్రలో ఇదే విషయాన్ని ప్రజలు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం తమకు చేరువగా లేదని నాయకులూ ఎవరూ తమను పట్టించుకోవడంలేదని అనేక చోట్ల ఆయనకు విన్నవించారు. దీంతో తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తామని లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. దీని నుంచే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. తద్వారా ప్రజలకు చెరువగా ఉండడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మరింతగా టిడిపిని పుంజుకునేలా చేయాలన్నది లోకేష్ ప్రధాన ఉద్దేశం.
సాధారణంగా ప్రజలకు దూరంగా ఉన్న ఏ ప్రభుత్వం కూడా తదుపరి ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అనేక పనులు చేశామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ప్రజలకు దూరంగా ఉండడంతో నాయకులకు ప్రజలకు మధ్య సంబంధం కట్ అయింది. దీనివల్లే అక్కడ ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక ఏపీలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలకు చేరువగా ఉండాలన్న ఒక దూర దృష్టితో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే ఎలా అన్నది మంత్రి నారా లోకేష్ ఆవేద. మరి ఇప్పటికైనా తమ్ముళ్లు కదులుతారా లేదా అనేది చూడాలి.


















