రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అధినేతగా నిలుస్తారు నారా చంద్రబాబు నాయుడు. 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన పదవీకాలం ముగిసే నాటికి మొత్తం 19 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన అధినేతగా అవతరిస్తారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేతల్లో ఎక్కువమంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం కనిపిస్తుంది.
సిక్కిం రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన పవన్ కుమార్ చామ్లింగ్ ఏకంగా 24 ఏళ్లు 165 రోజులు పని చేశారు. తర్వాతి నాయకుడిగా ఒడిశాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నవీన్ పట్నాయక్ నిలుస్తారు.ఆయన 24 ఏళ్ల 99రోజులుగా సీఎంగా వ్యవహరించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జ్యోతిబసు 23 ఏళ్లు 137 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు.అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా గెగాంగ్ అపాంగ్ సైతం 22 ఏళ్ల 250 రోజులు.. మిజోరం ముఖ్యమంత్రిగా లాల్ థన్హవ్లా 22 ఏళ్ల 60 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇలా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల్లో చంద్రబాబు ఒకరు.
ఆయన కోడలు నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెరిటేజ్ ఫుడ్స్ సంబంధిత వ్యాపారాల విషయంలో ఆమె తన సత్తా చాటారు. మంచి ఆడ్మినిస్ట్రేటర్ గా ఆమెకు వ్యాపారవర్గాల్లో మంచి పేరుంది. ఒక్క విమర్శను కూడా ఎదుర్కోకుండా ఉన్న అతి తక్కువ ప్రముఖుల కుటుంబ వారసుల్లో ఆమె ఒకరుగా నిలుస్తారు. రాజకీయం ఆమె ఇంటి అడ్రస్ అయినప్పటికి.. ఆమె రాజకీయాల్లో తలదూర్చటం.. ఆ వ్యవహరాల్ని తన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్ుతంది.
తాజాగా బిజినెస్ టుడే సంస్థ నిర్వహించిన ఎంపీడబ్ల్యూ 2025లో పాల్గొన్నారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు? అని నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు ఆమె అంతే స్పష్టంగా సమాధానం ఇచ్చేవారు. ‘‘కచ్ఛితంగా నాకు ఆసక్తికర రంగం కాదు. పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు.. కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి. ఆరోగ్యం.. పోషణ రంగాలపై నాకు ఆసక్తి. చిన్నప్పటి నుంచి ఆ రంగాలే నాకిష్టం’’ అంటూ మరో మాటకు అవకాశం లేకుండా సమాధానం ఇవ్వటం గమనార్హం.


















