అదేంటి లోకేష్ చంద్రబాబుకు ఒక్కగానొక్క కుమారుడు కదా మరి ఆయన అన్నయ్య ఏమిటి అన్న చర్చ వద్దు. ఆ సందేహం అసలే వద్దు. బాబుకు ఏకైక కుమారుడు అయితే కావచ్చు కానీ ఆయన బంధుగణం బహు పెద్దది అన్నది మరువరాదు. పైగా లోకేష్ కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అని చెబుతారు. దాంతో లోకేష్ కి ఎందరో తమ్ముళ్ళు అన్న మాట వినిపిస్తోంది. లోకేష్ వరసకు తమ్ముళ్ళుగా ఉన్న వారు అలా క్యూలో చాలా మంది కనిపిస్తున్నారు.
వారంతా లోకేష్ కి అండగా ఉంటున్నారు. టీడీపీలో యువ నేతగా భావి సీఎంగా ప్రచారంలో ఉన్న లోకేష్ కి పార్టీలో యూత్ అంతా అతి పెద్ద బలంగా బలగంగా ఉంది. అదే ఆయనకు అండ అనుకుంటే ఇక బంధుగణంలోనూ ఆయనకు కొండంత మద్దతు దక్కుతోంది.
ఇక తరచి చూస్తే ఆయనకు స్వయానా తోడల్లుడు శ్రీభరత్ వరసకు ఒక తమ్ముడిగా ఉన్నారు. శ్రీభరత్ విశాఖ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున 2024 ఎన్నికల్లో నెగ్గారు. ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. ఆయన తాత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ నుంచి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక తల్లి తరఫున తండ్రి మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు మరో తాత. ఇటీవలనే ఆయన ఇంట్లో షష్టిపూర్తి కార్యక్రమానికి శ్రీభరత్ తో పాటు లోకేష్ కూడా హాజరై సందడి చేశారు.
ఆ మరుసటి రోజే మరో తమ్ముడితో కలసి ఒక సైనిక స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేష్ ఒంగోలు జిల్లా పర్చూరు పాలొన్నారు. ఆయన ఎవరో కాదు దగ్గుబాటి హితైష్. లోకేష్ కి వరసకు మరో తమ్ముడు. పురంధేశ్వరి లోకేష్ కి స్వయాన పెద్దమ్మ. అలా మరింత దగ్గర తమ్ముడు హితేష్. ఆయనతో కూడా అన్నయ్య లోకేష్ ఎంతో అభిమానంతో ఆప్యాయతతో ఉంటూ వస్తున్నారు. ఇంకో వైపు చూస్తే నారా రోహిత్ అసలైన తమ్ముడిగా ఉన్నారు నారా వారి కుటుంబంలో లోకేష్ కి చిన్నాన్న రామ్మూర్తి నాయుడు కుమారుడిగా అనుంగు సోదరుడిగా ఉంటున్నారు. లోకేష్ వెన్నంటి రోహిత్ ఉంటారు. గత ఎనికల్లో ఆయన చేయాల్సిన సాయం తన వంతుగా టీడీపీకి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు అని ప్రచారంలో ఉంది. రోహిత్ లోకేష్ కి లక్ష్మణుడి లాంటి తమ్ముడు అని చెబుతారు..
ఇలా లోకేష్ కి అచ్చమైన అనుబంధం ఈ తమ్ముళ్ళతో ఉంది. టీడీపీ వంటి బలమైన పార్టీని నిభాయించాలంటే తనకంటూ మందీ మార్బలం ఉండాలని తలపోసే లోకేష్ కి తమ్ముళ్ళు అండగా ఉంటున్నారు అని చెబుతున్నారు. అలా వీరందరికీ లోకేష్ అన్నయ్యగా ఉంటూ అధినాయకుడుగా కూడా ఫ్యూచర్ లో మెరవబోతున్నారు. ఇక టీడీపీ కుటుంబంలో చూస్తే యువ నేతలు అంతా లోకేష్ కి తమ్ముళ్ళే అని అంటున్నారు. వారంతా లోకేష్ అన్నయ్యా అనే ప్రేమగా పిలుస్తారు. మొత్తానికి లోకేష్ బలమైన బంధాలతో అనుబంధాలతో టీడీపీకి భావి నాయకుడిగా మారబోతున్నారు అని అంటున్నారు.