బాలీవుడ్ నటుడు, నిర్మాత, పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తర్వాత ఆస్తుల వాటాల గురించి చాలా చర్చ సాగుతోంది. ఆస్తి తగాదాతో పాటు, అతడి మూడు పెళ్లిళ్లు, మాజీ భార్యల పిల్లల వారసత్వం గురించి కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడి కంపెనీ సోనాకామ్ స్టార్ సహా, 30వేల కోట్ల ఎస్టేట్ లో వాటాల కోసం మాజీ భార్యలు కూడా పోటీపడుతున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎస్టేట్ మ్యాటర్స్ లో సంజయ్ తల్లి గారైన రాణీ కపూర్ అసంతృప్తిగా ఉన్నారని, సంజయ్ ప్రస్తుత భార్య ప్రియా సచ్ దేవ్ వ్యవహారం ఆమెకు నచ్చడం లేదని కూడా కథనాలొచ్చాయి. ఆస్తిలో వాటాల కోసం చుట్టాలు అంతా ఎవరికి వారు తామే వారసులమని ప్రకటించుకుంటున్నారు. దీంతో రాణీ కపూర్ అసంతృప్తిగా ఉన్నారని కథనాలొస్తున్నాయి.
ఆస్తులను పంపిణీ చేస్తే, వాటాల వ్యవహారంలో దివంగత సంజయ్ కపూర్ రెండో భార్య కరిష్మాకపూర్, మూడో భార్య ప్రియా సచ్ దేవ్, వారి పిల్లల పేర్ల ప్రస్థావన ప్రతిసారీ మీడియాలో హైలైట్ అవుతోంది. అయితే సంజయ్ కపూర్ మొదటి భార్య నందిత మహ్తానీకి అతడి ఆస్తులతో ఎలాంటి సంబంధం లేదా? అంటే… ప్రస్తుతానికి నందిత సీన్ లో కనిపించడం లేదు. ఆమె నుంచి 2000లోనే సంజయ్ కపూర్ విడాకులు తీసుకున్నారు. ఈ జంట 1996 -2000 మధ్య కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఎవరి దారిలో వారు ఉన్నారు. ఆసక్తికరంగా సంజయ్ నుంచి విడిపోయిన తర్వాత నందిత పలువురు హీరోలతో ఎఫైర్లు సాగించారని కూడా కథనాలొచ్చాయి.
నందితపై రణబీర్ కపూర్ కి విపరీతమైన క్రష్ ఉంది. ఆ ఇద్దరూ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసారు. అలాగే టాప్ మోడల్ కం నటుడు డినోమోరియోతోను నందిత రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తరవాత బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తో ఆమెకు నిశ్చితార్థమైంది. విద్యుత్ ఆమెకు ప్రపోజ్ చేసిన తీరు గురించి కూడా ఆసక్తికర చర్చ సాగింది. డిజైనర్ నందితను విద్యుత్ పిచ్చిగా ప్రేమించాడు. తనను వివాహం చేసుకోమని అడిగే ముందు ఆగ్రాలోని 150 మీటర్ల ఎత్తైన గోడపై నుండి రాపెల్లింగ్ చేస్తూ సాహసోపేతమైన రీతిలో ప్రపోజ్ చేయడం చర్చకు వచ్చింది. తాజ్ మహల్ పరిసరాల్లో నిశ్చితార్థం కూడా ఆశ్చర్యపరిచింది. అయితే దురదృష్టవశాత్తూ నిశ్చితార్థం అయ్యాక కూడా ఈ జంట బ్రేకప్ అయింది. దాదాపు రెండేళ్ల పాటు కలిసి ఉన్నారు. కానీ వారి మధ్య మనస్ఫర్థలు వచ్చి విడిపోవడం మీడియాలో ప్రధానంగా చర్చకు వచ్చింది.
నందిత మహ్తానీ బాలీవుడ్ లో పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ, కత్రినా కైఫ్, గౌరీ ఖాన్, కరణ్ జోహార్ సహా చాలామందికి ఆమె డిజైనర్. హిందీ చిత్రసీమలో పాపులర్ నటీనటులకు నందిత డిజైనర్ గా పని చేసారు. నందిత నుంచి విడిపోయాక సంజయ్ కపూర్ కరిష్మా కపూర్ ని పెళ్లాడారు. కరిష్మా నుంచి బ్రేకప్ అయ్యాక, మోడల్ ప్రియా సచ్ దేవ్ ని పెళ్లాడారు. లండన్ లో గుండెపోటుతో మరణించాక సంజయ్ ఆస్తుల పంచాయితీ బయటపడింది.