NALSAR Students లేఖ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. CJI సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడంపై విద్యార్థుల అభ్యంతరాలు, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం, రాజ్యాంగ విలువలపై విశ్లేషణ.
న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే.. ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?
నల్సార్ విద్యార్థుల నిరసన దేనికి సంకేతం?
నల్సార్ విద్యార్థుల లేఖ ఒక ఆహ్వానానికి వ్యతిరేకత కాదు.. న్యాయవ్యవస్థను అద్దంలో చూసుకోమంటున్న రాజ్యాంగ తరగతి!
న్యాయాన్ని చదివిన 450 మంది విద్యార్థులు ఒక న్యాయమూర్తిని ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణ సంఘటన కాదు. అది కూడా భారత ప్రధాన న్యాయమూర్తి స్థాయి వ్యక్తిని. మరి ప్రశ్న ఏమిటి? విద్యార్థులు హద్దు దాటారా? లేక వ్యవస్థే విద్యార్థులకు నేర్పిన విలువల్ని మరచిపోయిందా?
ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి న్యాయం జరగకపోవడం ఒక్కటే కాదు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కరిగిపోవడం అంతకంటే పెద్ద ప్రమాదం.ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు కోర్టుకు వెళతారు. పోలీసులు అతిగా ప్రవర్తించారని భావిస్తే కోర్టు తలుపు తడతారు. అధికార యంత్రాంగం తమ హక్కులను కాలరాస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమకు న్యాయం చేయలేదని భావించిన పౌరుడు చివరకు న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తాడు.ఎందుకంటే ఈ దేశంలో చివరికి రాజ్యాంగం తమకు అండగా ఉంటుందని, కోర్టు తమ మాట వింటుందని ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకమే ప్రజాస్వామ్యానికి కనిపించని వెన్నెముక.
అలాంటి న్యాయవ్యవస్థపై న్యాయ విద్యార్థులే ప్రశ్నలు సంధిస్తే.. దాన్ని ఒక చిన్న వివాదంగా కొట్టిపారేయాలా? లేక ఆ ప్రశ్నల వెనుక దాగి ఉన్న అసంతృప్తిని, ఆందోళనను, నైతిక సంఘర్షణను అర్థం చేసుకోవాలా? నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులు అదే ప్రశ్నను దేశం ముందుంచారు.సుమారు 450 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయ ఉపకులపతి, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. తమ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని, ముఖ్య అతిథి ఎంపిక కూడా తుది దశకు రాలేదని తమకు తెలుసని చెబుతూనే.. అధికారిక నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాన్ని వినాలని కోరారు. విద్యార్థులు స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తామని చెప్పలేదు. న్యాయవ్యవస్థను తిరస్కరించలేదు. న్యాయమూర్తి తీర్పులన్నింటినీ ప్రశ్నించలేదు. వారి అభ్యంతరం ఒక నిర్దిష్ట సందర్భంలో న్యాయవ్యవస్థ ప్రవర్తించిన తీరుపైమాత్రమే.
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలను విచారించే విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలే వారి ఆందోళనకు కారణమని విద్యార్థులు పేర్కొన్నారు. నిరసనకారులపై పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోలను చూడటానికి సమయం లేదన్నట్టుగా వ్యాఖ్యలు వచ్చాయని, న్యాయవాది వాదనను మధ్యలోనే నిలిపివేసినట్టు వార్తలు వెలువడ్డాయని వారు ప్రస్తావించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై జస్టిస్ సూర్యకాంత్ తరువాత తనను తప్పుగా ఉటంకించారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సక్రమంగా దాఖలైన అంశాలను విచారించేందుకు సిద్ధంగా ఉంటుందని కూడా తెలిపారు.
ఇక్కడే ప్రజాస్వామ్యానికి అవసరమైన మరో విలువ ముందుకొస్తుంది. ఒకవైపు ప్రశ్నించే హక్కు. మరోవైపు సమాధానం చెప్పే హక్కు. రెండూ ఉండాలి. కానీ విద్యార్థులు ప్రశ్నించారనే కారణంతో వారి గొంతును కొట్టిపారేయడం మాత్రం ప్రజాస్వామ్య పద్ధతి కాదు.
ఇది సీజేఐ గురించి మాత్రమే కాదు. అసలు ఈ వివాదాన్ని కేవలం జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా పిలవాలా వద్దా?అనే స్థాయిలో చూస్తే అసలు సమస్యను మనమే చిన్నది చేసుకున్నట్టవుతుంది.ఇది అంతకంటే పెద్ద ప్రశ్న.
న్యాయవ్యవస్థను ప్రజలు ఎలా చూస్తున్నారు ?న్యాయస్థానాలు తమను తాము ఎలా చూస్తున్నాయి? ప్రజల హక్కుల విషయంలో కోర్టుల స్పందనలో సున్నితత్వం ఎంత ఉంది?అధికార వ్యవస్థపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించే నైతిక ధైర్యం ఎంత ఉంది? ఇవి న్యాయవ్యవస్థపై దాడి చేసే ప్రశ్నలు కావు. న్యాయవ్యవస్థను మరింత బలంగా ఉంచే ప్రశ్నలు.న్యాయమూర్తులు తప్పులు చేయరని ఎవరూ అనరు. తీర్పులు తప్పుపట్టలేనివి కావు. న్యాయస్థానాలు కూడా విమర్శలకు అతీతమైన పవిత్ర స్థలాలు కావు. కానీ న్యాయవ్యవస్థకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది ప్రజల నమ్మకంతో పనిచేస్తుంది.పోలీసులకు యూనిఫాం ఉంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం ఉంది. రాజకీయ నాయకులకు పార్టీలు, ఓటు బ్యాంకులు ఉన్నాయి. కానీ న్యాయవ్యవస్థకు అంతిమ బలం ఏమిటి? ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసం కరిగితే న్యాయవ్యవస్థ చేతిలో మిగిలేది చట్టపరమైన అధికారం మాత్రమే. నైతిక అధికారం మాత్రం బలహీనపడుతుంది.
న్యాయ విద్య అంటే సెక్షన్లు బట్టీ పట్టడం కాదు. కేసుల పేర్లు గుర్తుపెట్టుకోవడం కాదు. కోర్టులో వాదించడం నేర్చుకోవడం మాత్రమే కాదు. న్యాయ విద్య అంటే అధికారాన్ని ప్రశ్నించడం. బలహీనుడి పక్షాన నిలబడటం.రాజ్యాంగాన్ని కాపాడటం.పౌరుడి హక్కును గౌరవించడం.
అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకపోవడం. అందుకే నల్సార్ విద్యార్థులు తమ లేఖలో మేము నేర్చుకున్న విలువలు గురించి అని మాట్లాడటం అంత చిన్న విషయం కాదు.ఒక న్యాయ విద్యార్థి రేపు కోర్టులో నిలబడి ఒక నిరుపేద, ఒక నిరసనకారుడి, ఒక రాజకీయ ప్రత్యర్థి, ఒక మైనారిటీ వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సాధారణ పౌరుడి తరపన ప్రాతినిధ్యం వహించవచ్చు. అతని ముందు ఉండాల్సిన మొదటి ప్రశ్న ఈ వ్యక్తి ఎవరు అని కాదు. ఈ వ్యక్తికి న్యాయం జరిగిందా? అని అదే న్యాయవృత్తి యొక్క నైతిక పునాది.
మరి అదే విలువలను నేర్చుకున్న విద్యార్థులు ఇప్పుడు వ్యవస్థను చూసి అసౌకర్యానికి గురవుతున్నారంటే, మనం వారినే ప్రశ్నించాలా? వీరికి విలువలు ఎక్కువయ్యాయా? లేక మనమే ప్రశ్నించుకోవాలా?మనం వారికి నేర్పిన విలువలను మన వ్యవస్థ ఎంతవరకు ఆచరిస్తోంది?
అధికారాన్ని ప్రశ్నించేవారే ఎందుకు నిందితులు అవుతున్నారు. ఇది న్యాయవ్యవస్థకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు.రాజకీయ వ్యవస్థను చూడండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారు. పోలీసులను ప్రశ్నిస్తే పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అంటారు. మీడియాను ప్రశ్నిస్తే మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. మీడియా అధికారాన్ని ప్రశ్నిస్తే మీడియానే నిందితురాలవుతుంది. ఇప్పుడు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తే? కోర్టు ధిక్కారం” అనే భయం ముందుకొస్తుంది.
ఇలా ప్రతి సంస్థను ప్రశ్నించేవారే తప్పు చేసినవారిగా ముద్రపడితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది . ప్రజాస్వామ్యానికి అవసరమైనది సంస్థలపై అంధభక్తి కాదు. సంస్థలను గౌరవిస్తూనే వాటిని ప్రశ్నించే సంస్కృతి. కోర్టును గౌరవించడం అంటే కోర్టు గురించి ప్రశ్నించకపోవడం కాదు. పార్లమెంటును గౌరవించడం అంటే పార్లమెంటులోని ప్రతి నిర్ణయాన్ని సమర్థించడం కాదు. ప్రభుత్వాన్ని గౌరవించడం అంటే ప్రభుత్వాన్ని విమర్శించకపోవడం కాదు. ప్రజాస్వామ్యంలో గౌరవం అంటే జవాబుదారీతనం నుంచి మినహాయింపు కాదు.
న్యాయం కోసం చివరి గడపే మూసుకుపోతే?
ఒక రైతు తన భూమి కోసం కోర్టుకు వస్తాడు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయం కోసం కోర్టుకు వస్తుంది. ఒక విద్యార్థి తన హక్కు కోసం కోర్టుకు వస్తాడు. ఒక జర్నలిస్టు తన స్వేచ్ఛ కోసం కోర్టుకు వస్తాడు. ఒక నిరసనకారుడు పోలీసుల దౌర్జన్యంపై కోర్టుకు వస్తాడు. ఒక పౌరుడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తాడు. వారందరికీ ఒకే చివరి ఆశకోర్టు వింటుంది. న్యాయం జరుగుతుందని ఆ వింటుంది అనే విశ్వాసం కోల్పోతే? ప్రజలు న్యాయాన్ని ఎక్కడ వెతుకుతారు?అధికారుల దగ్గరా ?రాజకీయ నాయకుల దగ్గరా? పోలీసుల దగ్గరా?
సోషల్ మీడియా కోర్టు లోనా? వీధి నిరసనల్లోనా?అలా అయితే రాజ్యాంగబద్ధమైన పరిష్కారాల స్థానంలో గుంపు న్యాయం, రాజకీయ ఒత్తిడి, సామాజిక విభజన, మీడియా తీర్పులు పెరుగుతాయి. అదే ప్రజాస్వామ్య పతనానికి అసలు బాట.
న్యాయమూర్తులు దేవుళ్లు కాదు. రాజ్యాంగ సంరక్షకులు . న్యాయమూర్తులకు అపారమైన గౌరవం ఇవ్వాలి. కానీ ఆ గౌరవం వ్యక్తిగత ఆరాధనగా మారకూడదు. న్యాయమూర్తులు దేవుళ్లు కాదు. వారు రాజ్యాంగం కింద పనిచేసే రాజ్యాంగ సంస్థలోని అత్యున్నత బాధ్యత కలిగిన వ్యక్తులు. వారి చేతిలో ఒక ఆదేశం ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఒక వ్యాఖ్య ఒక వ్యవస్థకు సంకేతంగా మారగలదు. ఒక విచారణ ఒక పౌరుడి భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. అందుకే న్యాయమూర్తుల మాటల్లో, వ్యవహారశైలిలో, ప్రజల బాధను వినే తీరులో అపారమైన బాధ్యత ఉంటుంది. చట్టం తెలిసినవాడిగా ఉండటం ఒక అర్హత. న్యాయం కోసం వచ్చిన మనిషి బాధను అర్థం చేసుకోవడం ఒక నైతిక బాధ్యత. రెండింటి మధ్య తేడా ఉంది.
విద్యార్థుల ప్రశ్నకు విశ్వవిద్యాలయం సమాధానం చెప్పాలి. నల్సార్ యాజమాన్యం ఈ లేఖను కేవలం పరిపాలనా అభ్యర్థనగా చూడకూడదు. విద్యార్థులతో మాట్లాడాలి.వారి అభ్యంతరాలను వినాలి. అదే సమయంలో ముఖ్య అతిథి ఎంపికపై తుది నిర్ణయం విశ్వవిద్యాలయం స్వతంత్రంగా తీసుకోవచ్చు. కానీ విద్యార్థుల గొంతును వినడం వల్ల విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ తగ్గదు. అది పెరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు ప్రశ్నించగలిగే విశ్వవిద్యాలయమే నిజమైన న్యాయ విశ్వవిద్యాలయం.ఒక్క సంఘటన ఆధారంగా ప్రజాస్వామ్యం పతనావస్థకు చేరిందని తేల్చడం అతిశయోక్తి కావచ్చు. కానీ ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం తగ్గుతున్న సంకేతాలను నిర్లక్ష్యం చేయడం మాత్రం ప్రమాదకరం. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కూలిపోదు. ముందు సంస్థలపై నమ్మకం కరుగుతుంది.
తర్వాత ప్రశ్నించే ధైర్యం తగ్గుతుంది. ఆ తర్వాత ప్రజలు న్యాయం కోసం సంస్థల కంటే వీధిని ఆశ్రయిస్తారు. చివరికి చట్టంపై నమ్మకం బలహీనపడుతుంది. అప్పుడు రాజ్యాంగం పుస్తకంలో ఉంటుంది. సంస్థలు భవనాల్లో ఉంటాయి. చట్టాలు పుస్తకాలలో ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యం మాత్రం ప్రజల మనసుల్లో ఉండదు.నల్సార్ విద్యార్థులు వేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది కేవలం ఒక న్యాయమూర్తి కాదు. ఒక యూనివర్సిటీ కాదు. మన మొత్తం వ్యవస్థన్యాయవ్యవస్థ ప్రజలకు ఎంత దగ్గరగా ఉంది?అధికార దుర్వినియోగంపై అది ఎంత సున్నితంగా స్పందిస్తోంది? పోలీసు చర్యలపై ఆరోపణలు వచ్చినప్పుడు పౌరుడి స్వరాన్ని ఎంత ఓపికగా వింటోంది?న్యాయమూర్తులను ప్రశ్నించే హక్కును సమాజం ఎంతవరకు అంగీకరిస్తోంది?విద్యార్థులు నేర్చుకున్న రాజ్యాంగ విలువలు కోర్టు గడప దాటిన తర్వాత కూడా సజీవంగానే ఉన్నాయా? ఇవే అసలు ప్రశ్నలు.
450 మంది న్యాయ విద్యార్థుల లేఖను కొంతమంది అవిధేయతగా చూడొచ్చు.మరికొందరు రాజకీయ ప్రేరేపిత చర్యగా ముద్ర వేయొచ్చు. ఇంకొందరు న్యాయవ్యవస్థను అవమానించడంగా అభివర్ణించొచ్చు. కానీ అంతకంటే లోతుగా చూస్తేఅది ఒక తరం తనకు నేర్పిన రాజ్యాంగ విలువలను వాస్తవ జీవితంలో పరీక్షిస్తున్న క్షణం. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నించినవారినే తప్పుపట్టడం సులభం. కానీ అది పరిష్కారం కాదు.ప్రజాస్వామ్యానికి ప్రశ్నలు ప్రమాదం కాదు. ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడమే ప్రమాదం. న్యాయవ్యవస్థను బలహీనపరచేది విమర్శ కాదు. న్యాయవ్యవస్థపై విమర్శ వినే ఓపిక లేకపోవడమే. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేది విద్యార్థుల లేఖ కాదు.
మా మాట ఎవరు వింటారు? అనే నిస్సహాయత ప్రజల్లో పుట్టడమే.అందుకే నల్సార్ విద్యార్థుల లేఖను చించిపారేయాల్సిన కాగితంగా కాకుండా, న్యాయవ్యవస్థ తనను తాను చూసుకోవాల్సిన అద్దంగా చూడాలి. ఎందుకంటే రేపటి న్యాయవాదులు ఈరోజు అడుగుతున్న ప్రశ్న చాలా సూటిగా ఉంది. రాజ్యాంగం మాకు న్యాయం కోసం నిలబడమని నేర్పింది. కానీ న్యాయం కోసం వెళ్లే చివరి గడపలోనే మా గొంతు వినిపించకపోతే..
మేమెక్కడికి వెళ్లాలి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి. ఎందుకంటే అది 450 మంది విద్యార్థుల ప్రశ్న మాత్రమే కాదు.
రేపు కోర్టు తలుపు తట్టబోయే కోట్లాది భారతీయుల ప్రశ్న. మరియు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యే ప్రతి వ్యవస్థ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క నిజం. న్యాయం మీద ప్రజల నమ్మకం కూలిన రోజు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ పుస్తకాలు ఉన్నా, దాని ఆత్మ మాత్రం అనాథగా మిగిలిపోతుంది.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















