టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ గురించి అందరికీ తెలిసిందే. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ స్టార్ట్ చేసిన ఆ సంస్థ.. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సత్తా చాటింది. తొలి సినిమాతో మంచి లాభాలను సాధించింది.
అలా పదేళ్ల క్రితం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి సంస్థ.. అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. తెలుగుతోపాటు మలయాళం, తమిళ సినీ ఇండస్ట్రీల్లోకి ఇప్పటికే అడుగుపెట్టింది. రెండేళ్ల నుంచి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి బాధ్యతలు కూడా తీసుకుంది. అనేక సినిమాలను పంపిణీ చేసింది.
మొత్తానికి మైత్రి సంస్థ.. అటు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. ఇటు అనేక చిత్రాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే వచ్చే ఏడాది నాలుగు బడా హీరోల సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాటి షూటింగ్స్ ను శరవేగంగా జరుపుతోంది. మరికొద్ది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేందుకు కూడా రెడీ అవుతోంది. మైత్రి 2026 లైనప్ లో ఉన్న నాలుగు సినిమాలు ఇవే.
1.పెద్ది
2.ఉస్తాద్ భగత్ సింగ్
3.ఫౌజీ
4.డ్రాగన్
అయితే ఆ నాలుగు సినిమాలకు మైత్రి సంస్థ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టార్ హీరో రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది మూవీ.. వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ కానుంది. రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని వినికిడి.
ఇప్పటికే షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి విడుదల చేయనుంది. ఆ సినిమాను రూ.150 కోట్లతో నిర్మిస్తుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా.. త్వరలో రిలీజ్ తేదీని ఖరారు చేయనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ కూడా 2026లోనే రిలీజ్ కానుంది. ఆగస్టు 14వ తేదీన విడుదల అవ్వనుందని వినికిడి. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్.. శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ఫౌజీని మైత్రి సంస్థ రూపొందిస్తుందని అంచనా.
ఆ మూడింటితోపాటు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ సినిమా రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని అంచనా. అలా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, తారక్ చిత్రాలను మైత్రి సంస్థ.. రూ.1000 కోట్లకు పైగా వ్యయంతో రూపొందిస్తుందని సమాచారం. మరి ఆ సినిమాలతో ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.