కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో సంచనలంగా మారిన పదేళ్ల సహస్త్ర దారుణహత్య కేసు గుట్టు వీడిపోయింది. ఇంటి పక్కనే ఉండే పదో తరగతి చదివే బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ హత్యోదంతంలో దారుణమైన అంశం ఏమంటే.. దొంగతానికి వచ్చి.. ఆ విషయం బయటకు వస్తుందన్న భయంలో బాలికను చంపేయటం. బాగా తెలిసిన అమ్మాయి.. ఇంటి పక్కనే ఉండే అమ్మాయి.. కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టిన రోజున.. వాళ్లింట్లో జరిగిన వేడుకలో కేక్ తినిపించిన చేత్తోనే కత్తితో పోట్లు పొడిచి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది.
అయితే.. హత్యకు ఉపయోగించిన కత్తి ఎక్కడి నుంచి తెచ్చాడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన ఇంటికి దగ్గరగా ఉండే స్కూల్లో పదో క్లాస్ చదివే ఈ అబ్బాయి హత్య ఉదంతంలో బాలుడి పాత్ర మీద అనుమానం రావటంతో.. స్కూల్ కు వెళ్లి.. అతడ్నివిచారించారు. సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఎలా చేయాలి? ఎలా బయటకు వెళ్లాలి? అన్న అంశాల్ని పుస్తకంలో స్పష్టంగా రాసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు.. హత్య చేసిన తర్వాత నుంచి ఇంటి నుంచి పెద్దగా బయటకు వెళ్లకపోవటం.. టీవీ.. స్కూల్ కే పరిమితం కావటం లాంటివి చేసేవాడని గుర్తించారు. కొడుకులో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు కొంత అనుమానించినా.. తమ పిల్లాడు అంతటి దారుణానికి పాల్పడతారని మాత్రం వారు ఊహించలేదు.
పిల్లాడి తండ్రి వ్యాపారం చేసి నష్టపోగా.. తల్లి ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. సహస్త్ర ఇంట్లో ఉన్న రూ.80వేలు చోరీ చేసేందుకు వెళ్లి.. అక్కడ సహస్త్ర తనను చూడటంతో తన గుట్టు రట్టు కాకూడదన్న ఉద్దేశంతో హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ హత్య జరిగిన తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు జరిపినా.. ఎలాంటి ఆచూకీ లభించలేదు. సీసీ కెమేరాల్లో సైతం ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా పుటేజ్ లభించలేదు. అయితే.. పక్క అపార్టుమెంట్ నుంచి లోపలకు వెళ్లటంతో సీసీ కెమేరా కంటికి బాలుడు చిక్కలేదు. అయితే.. హత్య జరిగిన రోజున బాలుడ్ని తాను అపార్ట్ మెంట్ లో చూసినట్లుగా ఐటీ ఉద్యోగి ఒకరు చెప్పటంతో పోలీసులు అతడి మీద ఫోకస్ చేశారు. వర్కు ఫ్రం హోంలో భాగంగా తాను ఇంట్లో నుంచి పని చేస్తున్న వేళలో.. సహస్త్ర వాళ్ల ఇంటి వద్ద ఆ బాలుడ్ని చూసినట్లుగా చెప్పటంతో అనుమానించిన పోలీసులు.. బాలుడ్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. చివరకు పలు అంశాలు మ్యాచ్ కావటంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. మొదట్లో ఏమీ చెప్పకున్నా.. ఆ తర్వాత మాత్రం తాను హత్య చేసిన వైనాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది.