కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన తప్పిపోయిన వ్యక్తిని.. అతని 56 ఏళ్ల భార్య తన 33 ఏళ్ల ప్రియుడి సహాయంతో అతనిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వారికి సహకరించిన మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులను మీనాక్షమ్మ, ఆమె ప్రియుడు ప్రదీప్, అతని ఫ్రెండ్స్ సిద్ధేష్, విశ్వాస్‌లుగా పోలీసులు నిర్థారించారు. వీరంతా కడూరు నివాసితులు. మృతుడు సుబ్రమణ్య (60) వృత్తిరీత్యా దర్జీ అని పోలీసులు వెల్లడించారు.
మీనాక్షమ్మను కోర్టు ముందు హాజరుపరిచి సోమవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న మీనాక్షమ్మ తన భర్త సుబ్రమణ్య మే 31న బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అన్ని చోట్లా వెతికిన అనంతరం ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు సుబ్రమణ్య మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేశారు. జూన్ 3వ తేదీన పట్టాలపై సగం కాలిన కాలు కనిపించిందని రైల్వే పోలీసులు.. కడూరు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఆ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా.. సుబ్రమణ్య దర్జీ దుకాణం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో మే 31న ప్రదీప్, సిద్దేష్, విశ్వాస్‌లతో కలిసి కారులో ఎక్కడం గుర్తించారు.
“మేము ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము. వారు ప్రశ్నించినప్పుడు నేరం అంగీకరించారు. జూన్ 8న మేము వారిని కోర్టు ముందు హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించాము” అని దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. “వారు సుబ్రహ్మణ్యను చంపి మృతదేహాన్ని పడేసినట్లు అంగీకరించారు. కాబట్టి దొరికిన మృతదేహం తప్పిపోయిన ఆయనేదని స్పష్టమైంది. దర్యాప్తు సాగుతున్న కొద్దీ, ప్రదీప్.. మీనాక్షమ్మ మధ్య సంబంధం ఉందని మేము గ్రహించాము, కానీ ఇందుకు స్పష్టత ఇచ్చే ఆధారాలు లేవు” అని ఆ అధికారి చెప్పారు.
“తన భర్త మరణవార్త తెలుసుకున్న మీనాక్షమ్మ తీవ్రంగా ఏడుస్తూ భరించలేని బాధలో ఉన్నట్లు అనిపించింది. మేము ఆమెను మొదట్లో అనుమానించలేదు, కానీ ప్రదీప్, అతని స్నేహితులను మా స్టైల్లో ప్రశ్నించినప్పుడు ఆమె ప్రమేయం బయటపడింది. అయితే ప్రదీప్ వాంగ్మూలం తప్ప ఆమెను అరెస్టు చేయడానికి మా వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. మేము ఆమెను చాలాసార్లు ప్రశ్నించాం. కానీ ఆ సమయంలో ఆమె హత్యలో తన పాత్ర లేదని ఖండించింది” అని పోలీసు అధికారి వెల్లడించారు.
మీనాక్షమ్మ, ప్రదీప్‌ల కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ (CDR) ప్రకారం గత ఆరు నెలలుగా వారు ఎటువంటి ఫోన్ కాల్స్ మాట్లాడుకోలేదని తేలింది. అయితే, మీనాక్షమ్మ తరచుగా ఒక నంబర్‌కు ఫోన్లు, మెసేజ్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిది అని ఎంక్వైరీ చేయకగా ప్రదీప్ తల్లి పేరు మీద రిజిస్టర్ అయిందని తేలింది. సాంకేతిక దర్యాప్తులో ప్రదీప్ ఆ సిమ్ కార్డును ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో కేసు మిస్టరీ వీడింది.
మే 31న ప్రదీప్, ఇతర నిందితులు సుబ్రహ్మణ్యతో మాటలు కలిపి, మద్యం కొందామని చెప్పి తమ కారులో తీసుకెళ్లారు. అందరూ కలిసి సక్రెపట్న సమీపంలోని ఒక ఏకాంత ప్రదేశంలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రదీప్.. సుబ్రహ్మణ్యను గొంతు కోసి చంపాడు. తరువాత, వారు మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించారు కానీ అది పూర్తిగా కాలలేదు. దీంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులను సంప్రదించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
మీనాక్షమ్మ, సుబ్రమణ్యల దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. వారికి మనవరాళ్ళు కూడా ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం.. ఆమెకు దర్జీ వృత్తిలోనే ఉన్న ప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సన్నిహిత సంబంధానికి దారి తీసింది. అయితే, సుబ్రమణ్యకు ఆ విషయం తెలియడంతో.. తమ బంధానికి అడ్డు రాకూడదని మీనాక్షమ్మ అతన్ని అంతమొందించాలనుకుంది. దీంతో ప్రియుడు ప్రదీప్ సాయంతో భర్తను హత్య చేయించిదని పోలీసులు తేల్చారు.