‘తమ్ముడు’ మూవీ రివ్యూ
నటీనటులు: నితిన్- లయ- సప్తమి గౌడ- వర్ష బొల్లమ్మ- సౌరభ్ సచ్ దేవా- స్వసిక- హరితేజ- శ్రీకాంత్ అయ్యంగార్- టెంపర్ వంశీ- చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: కేవీ గుహన్-సమీర్ రెడ్డి- సేతు
నిర్మాతలు: రాజు-శిరీష్
రచన-దర్శకత్వం: వేణు శ్రీరామ్
ఐదేళ్ల కిందట వచ్చిన ‘భీష్మ’ తర్వాత యువ కథానాయకుడు నితిన్ హిట్టు ముఖమే చూడలేదు. మధ్యలో అతడి సినిమాలు అరడజనుదాకా వచ్చాయి.. వెళ్లాయి. ఇప్పుడతను ‘తమ్ముడు’తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
జై (నితిన్) ఒక ఆర్చర్. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలవాలన్నది అతడి కల. కానీ ప్రాక్టీస్ లో ఏకాగ్రత కుదరక.. ఇబ్బంది పడుతుంటాడు. ఏదో మానసిక సమస్య అతణ్ని వెంటాడుతూ ఉంటుంది. కొన్ని రోజుల ఆలోచన తర్వాత చిన్నప్పుడు తాను చేసిన ఓ తప్పు వల్ల తన అక్కకు దూరం కావడమే ఈ సమస్యకు కారణమని అతను అర్థం చేసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ (వర్ష బొల్లమ్మ) సాయంతో తన అక్కడను వెతికే పనిలో పడతాడు. తన పుట్టింటి మీద కోపంతో స్నేహలత నుంచి ఝాన్సీ కిరణ్మయిగా (లయ)గా పేరు కూడా మార్చుకుని కొత్త జీవితం గడుపుతున్న తన అక్క.. ఓ పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లు జైకి తెలుస్తుంది. అజర్వాల్ (సౌరభ్ సచ్ దేవా) అనే వ్యాపారవేత్త నుంచి ఝాన్సీకి ముప్పు ఉన్నట్లు తెలుసుకుంటాడు. మరి ఈ ముప్పు నుంచి తన అక్కను జై ఎలా కాపాడుకున్నాడు.. తన గురించి నిజాన్ని అక్కకు చెప్పాడా.. ఆమె అతణ్ని క్షమించిందా.. ఈ విషయాలన్నిటికీ సమాధానం తెర మీదే తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
‘తమ్ముడు’లో హీరో పదే పదే ‘అనుగచ్ఛతి ప్రవాహ..’ అంటూ ఉంటాడు. అంటే ‘లెట్స్ గో విత్ ద ఫ్లో’ అని అర్థమట. ఈ సినిమా కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంచుకున్న కథలో ‘నేచురల్ ఫ్లో’ ఉండుంటే బాగుండేది. కానీ ‘లెట్స్ గో విత్ ద ఫ్లో’ అని దర్శకుడు తనకు ఏమనిపిస్తే అది రాసుకుంటూ పోయి.. అలాగే తీసుకుంటూ పోయాడు అనిపిస్తుంది. ఇది ఏ తరహా సినిమా అంటే.. సరిగ్గా నిర్వచించలేని పరిస్థితి. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలా మొదలై.. ఆపై క్రైమ్ థ్రిల్లర్ గా రూపాంతరం చెంది.. తర్వాత అడ్వెంచరస్ రూట్లోకి వెళ్లి.. చివరికి ఏ జానర్ కూ న్యాయం చేయని సినిమాగా తయారైంది ‘తమ్ముడు’. మాస్ మసాలా సినిమాలు తీసే వేణు శ్రీరామ్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్తగా ఏదో చేయాలన్న ప్రయత్నం మంచిదే కానీ.. అది ఎంత వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందన్నది కూడా కాస్త ఆలోచించుకోవాల్సింది. కథలో బలమైన ఎమోషన్ లేకుండా.. అది ప్రేక్షకులకు కనెక్ట్ కాకుండా.. ఎంత ప్రయత్నించినా అది నేలవిడిచి సాము చేసినట్లే అవుతుంది. ‘తమ్ముడు’ విషయంలో అదే జరిగింది.
మన సినిమాల్లో హీరోయిన్ చనిపోవడం అన్నది అరుదు. అలా చనిపోతుంటే దానికి బలమైన కారణం ఉండాలి. ఆ సమయంలో ప్రేక్షకుల గుండెలు బరువెక్కాలి. కానీ ‘తమ్ముడు’లో హీరోయిన్ చనిపోతుంటే.. రవ్వంత కూడా ఎమోషన్ రాదు. ఆ పాత్రను ముగించడంలో పెద్దగా పర్పస్ కూడా కనిపించదు. సినిమాలో ఇంకా చాలా చావులు చూస్తాం. లెక్కకు మిక్కిలి విధ్వంసాలు కంటాం. కానీ ఆ చావులేవీ మనల్ని కదిలించవు. విధ్వంసాలు ఉద్వేగాన్నీ కలిగించవు. కథకు మూలమైన పాయింట్లోనే బలం లేకపోవడం.. ఎమోషన్ మిస్సవడం అందుకు ప్రధాన కారణం. తన ప్రేమ విఫలం కావడానికి కారణమైన తమ్ముడిని అక్క దూరం పెట్టడం వరకు కొంత లాజికల్ గా అనిపిస్తుంది కానీ.. ఆ తమ్ముడిని మళ్లీ కలిస్తే తన పాత ప్రేమికుడు గుర్తుకొస్తాడని.. అలా గుర్తుకొస్తే తాను ప్రస్తుతం బతుకుతున్న జీవితానికి అర్థం లేదంటూ మొత్తంగా తన పుట్టింటికి దూరం కావడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఓవైపు తన గురించి అన్నీ తెలిసి భర్త కూడా తనను అంగీకరించాక ఇలా తనకు తాను కండిషన్ పెట్టుకోవడంలో లాజిక్ కనిపించదు. అక్క పాత్రే కాదు.. హీరో.. విలన్.. ఇలా ముఖ్యమైన క్యారెక్టర్లు.. వాటి కథలు చిత్ర విచిత్రంగానే అనిపిస్తాయి ‘తమ్ముడు’లో. సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేని విలన్ని పరిచయం చేసిన తీరు చూసి ఈ క్యారెక్టరేదో భలే ఉందే అనిపిస్తుంది కానీ.. ముందుకు సాగేకొద్దీ అతడితో ముడిపడ్డ సన్నివేశాలన్నీ సహనానికి పరీక్ష పెడతాయి. అతడి ట్రాక్ కథతో సంబంధం లేనట్లు సాగిపోతుంటుంది. హీరో-విలన్ మధ్య డైరెక్ట్ క్లాష్ అన్నదే లేనపుడు.. విలన్ ఎంత అరాచకం చేసినా.. హీరో ఎంత వీరోచితంగా పోరాడినా.. వీరి వైరాన్ని ఫీలవ్వడానికి అవకాశమే కనిపించదు. ఇక హీరో.. తన అక్క సినిమా అంతా కలిసే సాగుతారు కానీ.. వాళ్ల మధ్య బలమైన ఒక్క ఎమోషనల్ సీన్ కూడా వర్కవుట్ చేయలేకపోయాడు దర్శకుడు.
ఆరంభ సన్నివేశాలతో ‘తమ్ముడు’ ప్రేక్షకుల దృష్టిని ‘తమ్ముడు’ ఆకర్షిస్తుంది. తమ్ముడిని అసహ్యించుకుని వెళ్లిపోయిన అక్క.. ఆ అక్కను వెతుక్కుంటూ వెళ్లే తమ్ముడు.. ఆ అక్క చుట్టూ పెద్ద ప్రమాదం.. తనను అసహ్యించుకునే అక్క దగ్గరే ఉంటూ తనను రక్షించుకోవాల్సిన పరిస్థితి… ఇలా ఈ సెటప్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. దీని చుట్టూ డ్రామా పండించడానికి అవకాశం కనిపించినా.. బలమైన ఎమోషన్ లేకపోవడం వల్ల.. పాత్రల చిత్రణ తేలిపోవడం వల్ల.. అనాసక్తికర సన్నివేశాల వల్ల ‘తమ్ముడు’ క్రమ క్రమంగా గాడి తప్పుతుంది. అడవిలో విలన్ గ్యాంగుల నుంచి ఎదురయ్యే దాడులను కాచుకుంటూ వెళ్లడం మీదే మెజారిటీ కథ నడుస్తుంది. కానీ ఒక దశ దాటాక ఈ సన్నివేశాలన్నీ రిపిటీటివ్ గా అనిపిస్తాయి. కొండగొడుగు ప్రాంతం.. అక్కడి మనుషులకు సంబంధించిన వ్యవహారం కథకు కొంచెం ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చినా.. ఒక దశ దాటాక అదంతా చాలా మామూలుగా అనిపించి డిస్కనెక్ట్ అయిపోతాం. సప్తమి గౌడ చేసిన రత్న పాత్రను తీర్చిదిద్దిన విధానం.. ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలు చాలా కృత్రిమంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో కథలో వచ్చే కొన్ని మలుపుల వల్ల ‘తమ్ముడు’ పర్వాలేదనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా నిరాశపరుస్తుంది. యాక్షన్ ఘట్టాలను భారీగా తీర్చిదిద్దడం వల్ల మాస్ ప్రేక్షకులు కొంత కనెక్ట్ అవుతారేమో కానీ.. అంతకుమించిన విశేషం ఏమీ కనిపించదు. హీరో సహా ఏ పాత్రతోనూ కనెక్ట్ కాలేకపోవడం.. కథకు కీలకమైన అక్కాతమ్ముళ్ల ట్రాక్ లో ఎమోషన్ మిస్ కావడం ‘తమ్ముడు’కు ఉన్న ప్రధాన బలహీనతలు. ఇటు కొత్తదనం కోరుకునేే ప్రేక్షకులనూ మెప్పించక.. అటు మాస్ ప్రేక్షకులనూ మురిపించక రెంటికీ చెడ్డట్లు తయారైంది ‘తమ్ముడు’.
నటీనటులు:
నితిన్.. జై పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నించాడు. తన లుక్.. నటన పాత్రకు సరిపోయాయి. కాకపోతే గత సినిమాల ప్రభావం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్లు అనిపిస్తుంది. ఒకే ఎమోషన్.. మరీ సీరియస్ గా నడిచే పాత్ర కావడంతో నితిన్ వేరియేషన్ చూపించడానికి అవకాశం లేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన లయకు కీలక పాత్రే దక్కింది కానీ.. ఈ క్యారెక్టర్ కు మొదట్లో ఇచ్చిన బిల్డప్ కి తర్వాత అది సాగే తీరుకి పొంతన లేదు. కానీ లయ నటనకు వంక పెట్టడానికి లేదు. ఈ సినిమా తర్వాత తనకు ఛాన్సులు రావచ్చు. ఫ్రెండ్లీగా ఉండే గర్ల్ ఫ్రెండ్ పాత్రలో వర్ష బొల్లమ్మ బాగానే చేసింది. కాంతార ఫేమ్ సప్తమి గౌడ చేసిన రత్న క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాలో అది పెద్ద స్పీడ్ బ్రేకర్. తన పెర్ఫార్మెన్స్ ఓకే. విలన్ పాత్రలో యానిమల్ ఫేమ్ సౌరభ్ సచ్ దేవా కొత్తగా కనిపించాడు కానీ.. తన పాత్ర ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్.. మిగతా నటీనటులు మామూలే.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ‘తమ్ముడు’లో మంచి ప్రమాణాలే కనిపిస్తాయి. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో తన మార్కు చూపించాడు. బీజీఎం మంచి ఊపుతో సాగింది. పాటలు కూడా పర్వాలేదు. ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పని చేసిన సినిమా విజువల్ గానూ బావుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. బాగా ఖర్చు పెట్టి తీసిన విషయం తెరపై కనిపిస్తుంది. ఐతే అన్ని వనరులు బాగానే సమకూరినా రచయిత-దర్శకుడు వేణు శ్రీరామ్ ఉపయోగించుకోలేక పోయాడు. అతడి కథ బాగానే అనిపించినా.. ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే లేక ప్రేక్షకులను అతను ఎంగేజ్ చెయ్యలేకపోయాడు. ప్రధాన పాత్రల మధ్య.. ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచడంలో వేణు ఫెయిలయ్యాడు.
రేటింగ్: 2.5/5