మొంథా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేసింది. పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తి నష్టం సంభవించాయి. చేతికి వచ్చిన పంట పోయింది. మరో వైపు చూస్తే రాష్ట్రంలో రోడ్లు విద్యుత్ సహా ఇతర మౌలిక సదుపాయాల మీద భారీగానే దెబ్బ పడింది. ఇలా చూస్తే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం తల్లకిందులు అయింది. అందుకే ఇది పెను విపత్తు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు ఇలా తుఫాన్ వెళ్లగానే అలా ఏరియల్ సర్వే చేశారు. ప్రధానంగా తుఫాన్ తీరం దాటిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న కీలక జిల్లాల గుండా ఆయన ఏరియల్ సర్వే సాగింది. మొత్తానికి మొత్తం పొలాలు నీరు నిండి చెరువులను తలపించాయి. ఎటు చూసినా నీరే దర్శనం ఇచ్చింది. ఆ మీదట రైతులతో బాబు మాట్లాడినపుడు వారి కంట కన్నీరు ఒలికింది. దాంతో చంద్రబాబు సైతం ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది అని మీడియాతో చెప్పారు. మొంథా తుఫాన్ తీవ్రతను ఆపగలిగాం కానీ పంట నష్టం ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగాయని అన్నారు. ఉద్యాన వన పంటలతో పాటు సంప్రదాయ పంటలు అన్నీ కూడా దెబ్బ తిన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1, 825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంట ఉందని అన్నారు. అలాగే ప్రత్తి మొక్కజొన్న మినుము వంటి పంటలు నీట మునిగినట్టు బాబు చెప్పారు. ఇలా పంట నష్టం అధికంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. అయితే ఇదంతా ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని ఆయన చెప్పారు. ఇక క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని కూడా అన్నారు.
వీలైనంత త్వరగా కేంద్రానికి నివేదికను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి జాప్యం లేకుండా నివేదికలు పంపిస్తే ఆ మీదట కేంద్రం నుంచి సాయాన్ని కూడా సత్వరమే పొందవచ్చు అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దాంతోనే చంద్రబాబు తుఫాన్ తీరం దాటిన వెంటనే ఏరియల్ సర్వే చేసి మరీ పరిస్థితి మీద ఒక అంచనాకు వచ్చారు. చూడబోతే వేలాది కోట్ల రూపాయల నష్టంగానే మొంథా తుఫాన్ మిగిల్చిందని అర్ధం అవుతోంది. కేంద్రం అయితే ఉదారంగానే వ్యవహరిస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారు.
గతంలో తుఫాన్ల సమయంలో నష్టాన్ని భర్తీ చేయమని కేంద్రాన్ని కోరితే ఆశించిన దాని కంటే తక్కువే లభించింది. ఈసారి మాత్రం స్వయంగా మోడీ ఫోన్ చేసి చంద్రబాబుతో తుఫాన్ తీవ్రత గురించి తెలుసుకోవడమే కాకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాంతో ఆశలు అయితే భారీగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నివేదికలు వేగంగానే సిద్ధం చేసి కేంద్రానికి అధికారులు నివేదిస్తే తాను కూడా ఈ విషయం మీద కేంద్రం వద్ద ప్రస్తావించవచ్చు అని వీలైనంత ఎక్కువగా సాయం పొందితే ఏపీకి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఏపీకి హుదూద్, తిత్లీ తరువాత వచ్చిన సూపర్ సైక్లోన్ గా మొంథాని భావిస్తున్నారు. మరి ఈసారి భారీగానే సయాం దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


















