వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు అన్నది తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత కేవలం 11 సీట్లు మాత్రమే దక్కిన నేపధ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం అసెంబ్లీకి హాజరు కాకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా తాము ఉన్నందువల్ల తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే రూల్స్ అంగీకరించవని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెబుతూనే ఉన్నారు. అసెంబ్లీకి వస్తే వారికి మైక్ ఇస్తామని ప్రజా సమస్యల మీద చర్చించవచ్చు అని చెబుతున్నారు. అయితే అసెంబ్లీకి మాత్రం వైసీపీ హాజరు కావడం లేదు. ఈ విషయం అలా ఉంటే అసెంబ్లీలో వైసీపీ ప్రత్యక్షం కావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే. అయితే అది అసలు అసెంబ్లీలో కానే కాదు, మాక్ అసెంబ్లీలో అన్న మాట.
రాజ్యంగ దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఈసారి ఘనంగా నిర్వహించింది. ప్రజాస్వామ్యానికి వేదిక అయిన అసెంబ్లీకి ఏకంగా ఏపీ మొత్తంగా ఉన్న 175 అసెంబ్లీ సీట్ల నుంది 175 మంది విద్యార్ధినీ విద్యార్ధులను తీసుకుని వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహించారు దాంతో ఒరిజినల్ అసెంబ్లీ మాదిరిగానే మాక్ అసెంబ్లీ కూడా ఎంతో ఆసక్తిని పెంచింది. అధికార ప్రతిపక్ష సభ్యులు అంతా సభలో కనిపించారు. గత ఏణ్ణర్థం కాలం లేని ఆ లోటుని మాక్ అసెంబ్లీ తీర్చేసింది.
ఇక సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వివిధ అంశాలకు సంబంధించి వాదులాట సాగడం విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం దాకా వెళ్ళడం వారిని అదుపు చేసేందుకు అధికార పక్షం వైపు నుంచి సభ్యులు పోటా పోటీగా రావడం దాంతో గందరగోళం చోటు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ దశలో సైలెన్స్ అంటూ స్పీకర్ స్థానంలో ఉన్న విద్యార్ధిని పలు మార్లు హెచ్చరించడం జరిగాయి. దయచేసి ఎవరి స్థానాల్లోకి వారు వెళ్ళి కూర్చోండి అని స్పీకర్ మందలించడం జరిగింది. అప్పటికీ మాట వినని సభ్యులను మార్షల్స్ బలవంతంగా తీసుకుని వెళ్ళి సభ నుంచి బయటకు పంపించడం జరిగిపోయాయి.
అసెంబ్లీ అంటే అధికార ప్రతిపక్ష సభ్యుల కలయిక అని అంశాల మీద చర్చ అని విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ కూడా నిరూపించింది. అయితే ఏపీ అసెంబ్లీలో మాత్రం విపక్షం రాకపోవడం కొంత బాధాకరం అన్న మాట ఉంది. మరి అసెంబ్లీకి వైసీపీ ఈ మొత్తం టెర్మ్ లో అయినా హాజరవుతుందా లేదా అన్నది అయితే ఒక చర్చగానే ఉంది. ఏది ఏమైనా మాక్ అసెంబ్లీ రూపంలో అయినా శాసనసభలో వైసీపీ విపక్ష పాత్రను చూడగలిగామని అంటున్నారు అంతా.


















