అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సుకు వైసీపీకి చెందిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారత ప్రభుత్వం తరఫున వెళ్లడం ఒక విధంగా ఆసక్తిని పెంచుతోంది. ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ కి ఇండియా నుంచి వెళుతున్న ఎంపీల ప్రతినిధి బృందంలో మిధున్ రెడ్డి ఉండడం విశేషం అయితే ఏపీ నుంచి ఆయన ఒక్కరే ఉండడం మరో విశేషం. ఇక ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఈ భారతీయ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఇక చూస్తే కనుక ఈ నెల 27న న్యూయార్క్ లో జరిగే ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ ఎంపీల బృందం పాలు పంచుకుంటుంది. మొత్తం 16 మంది ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి ఐక్య రాజ్య సమితి సదస్సుకు పంపిస్తోంది. అందులో ఏపీ నుంచి వైసీపీకి చాన్స్ ఇచ్చారు. అదే సమయంలో ఏపీ నుంచి టీడీపీ నుంచి 16 మంది ఎంపీలు జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఎన్డీయే మిత్రులుగా ఉన్నారు. కానీ లోక్ సభలో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న వైసీపీ నుంచి ఆ పార్టీ నేత అయిన మిధున్ రెడ్డిని ఎంపిక చేయడం ఒక విధంగా రాజకీయ చర్చకు దారి తీస్తోంది.
ఇక మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో మొత్తం 73 రోజుల పాటు ఉన్నారు ఆయన లిక్కర్ స్కాం కేసులో సిట్ అరెస్ట్ చేస్తే రిమాండ్ లో ఉన్నారు. అయితే ఆయనకు ఇటీవలనే బెయిల్ దక్కింది. దాంతో ఆయన బయటకు వచ్చారు వైసీపీ ఆయనకు పార్టీలో కీలక పదవి ఇచ్చి గౌరవిస్తే ఇపుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఇండియా తరఫున డెలిగేట్ గా హాజరవుతున్నారు. దీంతో వైసీపీ ఎంపీకి ఈ విధంగా చాన్స్ దక్కడం పట్ల అయితే రాజకీయంగా చూస్తే చర్చగానే ఉంది.
దీనిని ఎలా చూడాలి అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచించే నేపథ్యం ఉంది. అయితే ఇండియా నుంచి ఐక్య రాజ్య సమితికి గతంలో కూడా ఎందరో విపక్షాల నుంచి ప్రతినిధులుగా వెళ్ళారు. కీలక ప్రతిపక్ష నాయకులు అయితే ఏకంగా నాయకత్వమే వహించారు. అయితే ఏపీలో రాజకీయం పరంగా చూస్తే వైసీపీకి ఈ గౌరవం ఇవ్వడం వింతా విశేషంగానే చూడాలని అంటున్నారు. పైగా లిక్కర్ స్కాం ని చాలా ప్రతిష్టగా తీసుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నేతలను అరెస్ట్ చేస్తోంది. ఇక ఏపీలో చూస్తే టీడీపీ వైసీపీల మధ్య ఉప్పు నిప్పుగా వాతావరణం ఉంటుంది ఏపీ బీజేపీ నేతలు కూడా వైసీపీ మీద అంతే స్థాయిలో విరుచుకుపడతారు.
కానీ కేంద్ర స్థాయిలో మాత్రం వైసీపీ లోక్ సభ నాయకుడిగా మాత్రమే చూసి మిధున్ రెడ్డికి ఈ చాన్స్ ఇచ్చారని అనుకోవాలి. మరి ఆ సమయంలో ఆయన మీద లిక్కర్ కేసు అరెస్టులు ఇవ్వన్నీ పరిగణనలోకి తీసుకోలేదా అన్న చర్చ కూడా ఉంది. అయితే దీనిని రాజకీయ ప్రేరేపిత కేసుగా చూస్తున్నారా లేక పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఏమైనా సంకేతాలు కాషాయం శిబిరం వైపు వెళ్తున్నాయా అన్న చర్చ కూడా సాగుతోందిట. చూడాలి మరి దీని పర్యవసానాలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో.