వైసీపీ నేత, ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిలు పిటిషన్ తిరస్కరించిన కోర్టు రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోకూడదనే ఉద్దేశంతో మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం తిరిగి 11వ తేదీన లొంగిపోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఏ4గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. జులై 19న సిట్ విచారణకు వెళ్లిన ఆయనను అదే రోజు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు సుప్రీంకోర్టు రక్షణతో కొన్నాళ్లు అరెస్టు నుంచి తప్పించుకున్న మిథున్ రెడ్డి.. ఆ తర్వాత సిట్ వాదనలతో సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కించుకోలేకపోయారు. దీంతో జులై 19 అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి సుమారు 50 రోజులుగా ఆయన జైలులోనే ఉన్నారు.
విచారణ కోర్టు అయిన ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నా, ఇంతవరకు ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ దక్కలేదు. రెగ్యులర్ బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. స్కాంలో ఆయన పాత్రపై చార్జిషీటు వేయాల్సివుండటంతో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిలు ఇవ్వొద్దని సిట్ వాదిస్తూ వస్తోంది. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉండటం, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఓటు వేయాల్సివున్నందున కనీసం మధ్యంతర బెయిలు అయినా ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై రెండు రోజుల క్రితమే వాదనలు జరగగా, మిథున్ రెడ్డి ఓటు వేయాలనే సాకుతో బయటకు రావాలని చూస్తున్నారని, ఆయనకు బెయిలు ఇవ్వొద్దని సిట్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే రాజ్యంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోకూడదని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 9వ తేదీన ఓటు హక్కు వినియోగించుకుని, 11వ తేదీన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
సుమారు 50 రోజుల పాటు రిమాండ్ జైలులో ఉన్న మిథున్ రెడ్డి మధ్యంతర బెయిలుపై బయటకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం జైలు నుంచి విడుదలై తిరిగి 11వ తేదీన లొంగిపోవాల్సివుందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన 5 రోజుల పాటు బయట గడపనున్నారు. మిథున్ రెడ్డి అరెస్టు అయిన నుంచి ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే ఉండిపోయారు. మిథున్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాబాయ్ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఎప్పటికప్పుడు మిలాఖత్ ద్వారా ఆయనను కలుస్తూ ధైర్యం చెప్పేవారు.