‘మిరాయ్’ మూవీ రివ్యూ
నటీనటులు: తేజ సజ్జ- మంచు మనోజ్- రితిక నాయక్- శ్రియ సరన్- జగపతిబాబు- జయరాం- గెటప్ శీను- వెంకటేష్ మహా- కిషోర్ తిరుమల- తంజా కెల్లర్- పవన్ చోప్రా-రాజ్ జుట్సి తదితరులు
సంగీతం: హరి గౌర
మాటలు: మణిబాబు కరణం
స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని- మణిబాబు కరణం
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
కథ-ఛాయాగ్రహణం-దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
మిరాయ్.. తెలుగు నుంచి మరో పాన్ ఇండియా హిట్ అవుతుందనే అంచనాలు కలిగించిన సినిమా. దీని టీజర్.. ట్రైలర్ అంత గొప్పగా అనిపించాయి. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ మరోసారి సూపర్ హీరో పాత్ర పోషించాడిందులో. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్’ అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం పదండి.
కథ:
కళింగ యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తి.. జరిగిన ప్రాణ నష్టానికి చింతించి తన దగ్గరున్న దైవ శక్తిని తొమ్మిది గ్రంథాల్లోకి పంపించి వాటిని మంచి కోసం వినియోగించమని ఆదేశిస్తూ తొమ్మిది మంది యోధులకు అప్పగిస్తాడు. ఆ తొమ్మిదిమంది తమ తర్వాతి తరాలకు ఆ గ్రంథాలను వారసత్వంగా అందిస్తూ ప్రపంచాన్ని కాపాడుతుంటారు. ఐతే వందల ఏళ్ల తర్వాత ఈ తొమ్మిది గ్రంథాల శక్తితో ప్రపంచాన్ని శాసించాలనే దుర్బుద్ధితో మహావీర్ నామా (మంచు మనోజ్).. ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మొదలుపెడతాడు. మరి ఈ తొమ్మిది గ్రంథాలూ అతడి సొంతం అయ్యాయా.. అతణ్ని అడ్డుకోవడానికి వచ్చిన వేద (తేజ సజ్జ) నేపథ్యమేంటి.. వీరి మధ్య పోరులో అంతిమ విజేత ఎవరు.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
దైవ భక్తి వెర్సస్ దుష్ట శక్తి.. తెలుగు సినిమా ఆరంభ దశ నుంచి దీన్ని మించిన సక్సెస్ ఫుల్ కథా వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్ సక్సెస్ కు ఇది చాలా దగ్గరి దారి. కానీ కాలం మారేకొద్దీ కథలు ఆధునికత సంతరించుకోవడంతో ఒక దశ దాటాక ఈ ఫార్ములాను పక్కన పడేశారు రచయితలు-దర్శకులు. కానీ లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అన్నట్లు.. సినిమా కూడా రింగులు తిరిగి ఇప్పుడు మళ్లీ పాత ఫార్ములా వైపు చూస్తోంది. డివైన్ ఎలిమెంట్స్ చుట్టూ భారీ కథలు రూపుదిద్దుకుంటున్నాయి. కార్తికేయ-2.. కాంతార.. హనుమాన్.. లాంటి చిత్రాల సక్సెస్ తో ఈ ట్రెండు మరింత ఊపందుకుంది.
ఐతే కేవలం దేవుడి పేరు చెప్పి కథలు అమ్మేయాలనుకుంటే కుదరదు. ఆ ప్రయత్నం ఒక కన్విక్షన్ తో.. సరైన విజన్ తో చేయాలి. కల్పిత విషయమైనా ప్రేక్షకులను నమ్మించి ఆ ఊహా ప్రపంచంలో విహరింపజేసేలా కథ ఉండాలి. విజువల్ గా ఒక మాయాజాలం చెయ్యాలి. ‘మిరాయ్’లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. పురాణాలతో ముడిపెట్టి రాసిన ఆసక్తికర కథకు.. బిగువైన కథనం.. బలమైన పాత్రలు.. చక్కటి పెర్ఫామెన్సులు.. వావ్ అనిపించే విజువల్స్.. రోమాంచితమైన సంగీతం.. ఇలా అన్నీ తోడవడంతో ‘మిరాయ్’ తెలుగు నుంచి మరో విజువల్ వండర్ గా తయారైంది.
ఒక సినిమాకు పునాది కథ. అది బాగుంటే.. అందులో పని చేసేవాళ్లందరూ ఇన్‌స్పైర్ అయి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆటోమేటిగ్గా ఔట్ పుట్ వేరే లెవెల్లో వస్తుంది. ఇందుకు ‘మిరాయ్’ ఒక గొప్ప ఉదాహరణ. ట్రెండును ఫాలో అయిపోదాం.. క్యాష్ చేసుకుందాం అని దేవుడు-దుష్టశక్తి అంటూ అతనేమీ మొక్కుబడిగా కథ రాయలేదు. ఎంతో కసరత్తు చేసిన కథను.. ముఖ్య పాత్రలను తీర్చిదిద్దుకున్న విషయం తెరపై స్పష్టంగా అర్థమవుతుంది. తొమ్మిది గ్రంథాలకు సంబంధించి కథా నేపథ్యం ఆరంభంలోనే ప్రేక్షకుల ఆసక్తిని రాబడుతుంది. ఐతే దాన్ని మించి ఈ గ్రంథాలను చేజిక్కించుకుని ప్రపంచాన్ని ఏలాలనుకునే వ్యక్తి స్టోరీ ‘మిరాయ్’లో హైలైట్ గా నిలుస్తుంది.
మంచు మనోజ్ చేసిన మహావీర్ నామా అనే ఆ పాత్రే సినిమాకు ఆయువుపట్టు. ముందు మామూలు విలన్ పాత్రలాగే అనిపించినప్పటికీ.. దశల వారీగా ఆ క్యారెక్టర్ వెనుక కథను నరేట్ చేసిన తీరు ఆ పాత్ర ఇంటెన్సిటీని పెంచుతుంది. విలన్ పాత్రకు సంబంధించిన బ్యాక్ స్టోరీలో ప్రతి సన్నివేశం కట్టిపడేస్తుంది. క్రమ క్రమంగా పెరిగే ఆ పాత్ర ఆ పాత్ర ఎంతో శక్తిమంతంగా అనిపిస్తుంది. దీంతో దాన్ని ఢీకొట్టే హీరో పాత్ర కూడా ఆటోమేటిగ్గా ఎలివేట్ అయింది. దాంతో పాటే సినిమా బలమూ పెరిగింది.
కథ నేపథ్యాన్ని వివరించే ఆరంభ సన్నివేశాల తర్వాత ‘మిరాయ్’ కొంచెం ఎగుడుదిగుడుగా సాగుతుంది. హీరోకు ఒక లక్ష్యం ఏర్పడి.. దాని కోసం అతను కదిలే వరకు ‘మిరాయ్’ వేగం పుంజుకోదు. ఫిల్లింగ్ సీన్లు.. అవసరం లేని కామెడీతో ప్రథమార్ధంలో కొంతసేపు ‘మిరాయ్’ బోర్ కొట్టిస్తుంది. కానీ హీరో కార్య క్షేత్రంలోకి దిగాక మాత్రం కథనం పరుగులు పెడుతుంది. మిరాయ్ అనేది ఒక ఆయుధం. దాన్ని కాపాడే భారీ పక్షి అవతారం అయిన సంపాతిని హీరో ఢీకొట్టి మిరాయ్ ని దక్కించుకునే ఎపిసోడ్ ప్రథమార్ధానికి హైలైట్. అప్పటిదాకా మామూలు సినిమాలా కనిపించే ‘మిరాయ్’.. ఆ ఎపిసోడ్ నుంచి విజువల్ గా సినిమాను మరో స్థాయికి వెళ్తుంది. ఇక్కడి నుంచి చివరి వరకు అదే భారీతనాన్ని మెయింటైన్ చేసింది ‘మిరాయ్’ టీం. ఓవైపు హీరో పాత్ర చేసే అడ్వెంచర్స్.. మరోవైపు విలన్ పాత్ర బ్యాక్ స్టోరీ.. ద్వితీయార్ధాన్ని రసవత్తరంగా మార్చాయి.
కొన్ని చోట్ల హీరోకు పెద్దగా ఛాలెంజ్ ఏమీ లేకుండా అంతా కన్వీనియెంట్ గా సాగిపోవడం కొంత నిరాశ కలిగించినా.. అంతలోనే ఈ అసంతృప్తిని మరిపించే ఎపిసోడ్లతో ‘మిరాయ్’ మేకప్ చేసేస్తుంది. ప్రి క్లైమాక్సుకు రసకందాయంలో పడే ‘మిరాయ్’.. పతాక సన్నివేశాలతో కట్టిపడేస్తుంది. శ్రీరాముడి పాత్రతో ముడిపడ్డ ముగింపు సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. తెలుగు ప్రేక్షకులనే కాక పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్సుని మెప్పించే ఆకర్షణలు ‘మిరాయ్’లో ఉన్నాయి. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ నుంచి ప్రేక్షకులు ఆశించే సరైన ఫాలోఅప్ సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’ అనడంలో సందేహం లేదు.
నటీనటులు:
తేజ సజ్జ అనుభవం కొద్దీ రాటుదేలుతున్నాడు. ‘హనుమాన్’ సక్సెస్ అతడిలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచినట్లుంది. వేద పాత్రలో ఎంతో కాన్ఫిడెంటుగా నటించాడు. మొదట్లో మామూలుగా అనిపించినా.. సినిమా ముందుకు సాగేకొద్దీ తన పాత్ర.. నటన మెప్పిస్తాయి. ద్వితీయార్ధంలో తన పాత్రకు క్రమ క్రమంగా మంచి ఎలివేషన్ దక్కింది. సూపర్ హీరో పాత్రకు అవసరమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో తేజ ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఘట్టాల్లో అతడి కష్టం కనిపిస్తుంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. దీని కంటే ముందు నెగెటివ్ రోల్ చేసిన ‘భైరవం’లో మాదిరి ఇక్కడ అతడి నటనలో ‘అతి’ కనిపించలేదు.
మహావీర్ నామా పాత్రలో సటిల్ గా విలనిజం పండించాడు. తన లుక్ కూడా బాగా కుదిరింది. బలమైన పాత్ర కావడంతో మనోజ్ బాగా ప్రభావం చూపించగలిగాడు. ఈ సినిమా తర్వాత అతడికి పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ రోల్స్ వస్తే ఆశ్చర్యం లేదు. హీరోయిన్ రితిక నాయక్ చూడ్డానికి క్యూట్ గా అనిపిస్తుంది. తన నటన పర్వాలేదు. తన పాత్ర పరిధి తక్కువే. శ్రియ సరన్ కీలక పాత్రలో ఆకట్టుకుంది. తక్కువ సన్నివేశాల్లో కనిపించినా.. సినిమా అంతా తన ప్రభావం ఉంటుంది. జగపతిబాబు.. జయరాం లాంటి సీనియర్ నటులు తమ అనుభవాన్ని చూపించారు. గెటప్ శీను.. వెంకటేష్ మహా.. వెంకటేష్ మహా.. వీళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
‘మిరాయ్’ సినిమాకు సంగీత దర్శకుడు హరి గౌర తెర వెనుక ‘సూపర్ హీరో’గా నిలిచాడు. ‘హనుమాన్’తో తన ప్రతిభేంటో చూపించిన హరి.. ఈ సినిమా వరకు విశ్వరూపమే చూపించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాడు హరి. కొన్ని ముఖ్య సన్నివేశాలను అతను స్కోర్ ఎలివేట్ చేసిన తీరు అద్భుతం. అతను కంపోజ్ చేసిన డివోషనల్ థీమ్స్ కూడా బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ను చిత్ర బృందం బాగా ఉపయోగించుకుంది. సంపాతి అనే భారీ పక్షితో ముడిపడ్డ సీన్లతో పాటు వీఎఫెక్స్ వాడిన సీన్లన్నీ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించింది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయీ తెరపై కనిపిస్తుంది. మాటల రచయిత.. స్క్రీన్ ప్లేలో కూడా భాగమైన మణిబాబు కరణం తన ప్రతిభను చాటుకున్నాడు. ‘‘మన్ను జీవం.. విత్తు దైవం.. రెండూ కలిస్తే వృక్షం’’ లాంటి మాటలు ప్రభావవంతంగా అనిపిస్తాయి.
ఇక కథా రచయిత-దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎఫర్ట్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే. ఈ కుర్రాడు ఇలాంటి భారీ చిత్రాన్ని ఇంత స్పష్టతతో తీయగలిగాడంటే ఆశ్చర్యం కలగదు. పురాణాలతో ముడిపెట్టి అతను కథ రాసిన తీరు.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన వైనం ఆశ్చర్యపరుస్తాయి. కెమెరామన్ కూడా తనే కావడంతో తన విజన్ ను అతను పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకురాగలిగాడు. ఈ సినిమాతో అతను రచయితగా-దర్శకుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు.
రేటింగ్-3.5/5