రాష్ట్రానికి మరో ఐటీ దిగ్గజం రాబోతోంది. ఐటీ రంగంలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలిచేలా ముందడుగు వేసిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిసి పనిచేస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీకి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ సేవలు అందించేందుకు గతంలో ఒప్పందం కుదిరింది.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెలారంభంలో సెమినార్ కూడా నిర్వహించేంది. దీంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సంస్థల ఏర్పాటుకు ప్రముఖ టెక్నాలజీ సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా, టీసీఎస్, సిస్కో తమ కార్యకలాపాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అమరావతిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటరింగ్ లో తన తొలి రీసెర్చ్ సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
గత ప్రభుత్వంలో ఇలాంటి కంపెనీలు రాష్ట్రం వైపు చూడలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నేతలు హర్షం ప్రకటిస్తున్నారు. అమరావతిలోని క్వాంటమ్ పరిశోధన కేంద్రం కోసం ఇప్పటికే అధికారుల స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. త్వరలో ఒప్పందం కుదరనుంది. ప్రస్తుతం జరిగిన చర్చల ప్రకారం అమరావతిలో మైక్రోసాఫ్ట్ కోసం 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించనున్నారు.
అయితే ఈ భవనాన్ని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందా? లేకా మైక్రోసాఫ్ట్ నిర్మిస్తుందా? అన్నది స్పష్టత రాలేదు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ తన ప్రధాన కార్యాలయం అమెరికాలో 50 క్యూబిక్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీ ప్రోత్సాహించడంలో ఏపీ ముందుడంతో ఇక్కడ కూడా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించిందని చెబుతున్నారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కోసం ఏపీ ప్రభుత్వం సుమారు 90 లక్షల చదరపు అడుగుల మేర సదుపాయాలను కల్పించనుందని చెబుతున్నారు. ఇందులో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐబీఎం సంస్థ కోసం భవనం నిర్మించనున్నారు.
ఐబీఎం ఇక్కడ 156 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయనుంది. ఇక అలాగే ఐటీ హర్డ్ వేర్, సాఫ్ట్ వేర్ తయారీ పరిశ్రమలను అమరావతికి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అంటున్నారు.
ఈ క్రమంలో ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థలతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. గూగుల్, అమెజాన్, అయానక్యూ వంటి సంస్థలు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అనేక సాంకేతికతలపై పరిశోధనలకు సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలతో ఏపీ అధికారులు టచ్ ఉన్నట్లు చెబుతున్నారు.