మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచే వ్యతిరేకత: అనిల్ రెడ్డి
అనంతపురం:
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దలే కాకుండా సామాన్య ప్రజలు కూడా స్పందిస్తున్నారని, ఈరోజు ప్రజల స్పందనను బట్టి అదే స్పష్టంగా తెలుస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల సంక్షేమం కోసం దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి పేద ఇంటికి పెద్ద కొడుకులా బాధ్యతలు తీసుకుని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేశారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా, స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన మెడికల్ కళాశాలల కంటే ఎక్కువగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి నిర్ణయం తీసుకుని ప్రజల కోసం నిర్మించారని అన్నారు. ఇవన్నీ ప్రజల ఆస్తులేనని, దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను ప్రైవేటీకరణకు అప్పగించడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు.ఈ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం పూర్తిగా ప్రజా ఉద్యమమని, కేవలం వైసీపీ కార్యకర్తలే కాకుండా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతోనే టిడిపి ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.బైక్ ర్యాలీ సందర్భంగా అనంతపురం అంతటా ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూస్తే, టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పేనన్న విషయం స్పష్టమవుతోందన్నారు. తమ నిర్ణయం సరైనదేనన్న ధైర్యం ఉంటే, టిడిపి నాయకులు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. 13 పాత జిల్లాల్లో ప్రజలే వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తమ తీర్పు ఇస్తారని అనిల్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించిన ఆయన, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు అప్పగించడం అన్యాయమని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.















