‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
నటీనటులు: రవితేజ- శ్రీలీల- నవీన్ చంద్ర- రాజేంద్ర ప్రసాద్- మురళి శర్మ- నరేష్- సముద్రఖని- నితిన్ ప్రసన్న- హైపర్ ఆది- అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగామ
నిర్మాతలు: నాగవంశీ సాయి సౌజన్య
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: భాను భోగవరపు
ధమాకా తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు రవితేజ. గత ఏడాది ‘ఈగల్’.. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలతో షాక్ తిన్న మాస్ రాజా.. కొంచెం గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మాస్ జాతర రవితేజ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ:
లక్ష్మణ్ భేరి వరంగల్లో రైల్వే పోలీస్ ఫోర్స్ లో ఎస్ఐ. ముక్కుసూటిగా వ్యవహరించే అతను.. తన పరిధిలోకి ఏ కేసు వచ్చినా దాని అంత తేల్చకుండా వదలడు. అందుకే పదే పదే బదిలీ అవుతుంటాడు. అలా అతను శ్రీకాకుళం మన్యం ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గంజాయి వ్యాపారం చేసే శివుడు (నవీన్ చంద్ర)తో అతడికి ఘర్షణ మొదలవుతుంది. తనకు అడ్డు తగిలిన లక్ష్మణ్ ప్రాణాలు తీస్తానని శపథం చేస్తాడు శివుడు. అతడి వల్ల అన్యాయానికి గురైన వాళ్ల కోసం నిలబడ్డ లక్ష్మణ్.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తాడు. మరి ఈ ఇద్దరి పోరులో చివరికి గెలిచిందెవరు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
రవితేజ లాంటి మాస్ హీరో చేసే మసాలా సినిమాల నుంచి కొత్త కథ.. సరికొత్త సన్నివేశాలను ఆశించలేం. దానికి ప్రేక్షకులు ముందుగా ప్రిపేరయ్యే థియేటర్లలోకి అడుగుపెడతారు. ఒక టెంప్లేట్ ప్రకారం కథాకథనాలు నడిచిపోయినా సరే.. మాస్ అంశాలు సరైన మీటర్లో ఉండడం.. ఎమోషన్ వర్కవుట్ కావడం.. ఎలివేషన్-యాక్షన్ సీక్వెన్సులు పండడం మీద ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలు అందుకుంటాయన్నది ఆధారపడి ఉంటుంది. ఈ మీటర్ ను పట్టుకోవడానికి రవితేజ మాస్ హిట్ల నుంచే రెఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు దర్శకులు. ‘సామజవరగమన’తో రచయితగా సత్తా చాటుకుని ‘మాస్ జాతర’తో దర్శకుడిగా మారిన భాను భోగవరపు.. మాస్ రాజా ‘క్రాక్’ మూవీని ఒక టెంప్లేట్ లాగా పెట్టుకుని తన డెబ్యూ మూవీ కోసం కథాకథనాలను సిద్ధం చేసుకున్నట్లు అనిపిస్తుంది.
రవితేజను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపించి.. ఆయన అభిమానులతో పాటు మాస్ ను అలరించే ప్రయత్నం చేశాడు భాను. కానీ కొన్ని ఎపిసోడ్ల వరకు అతను టార్గెటెడ్ ఆడియన్సుని అలరించగలిగాడు కానీ.. రెండున్నర గంటలు ఆ వర్గం ప్రేక్షకులను సైతం కుదురుగా కూర్చోబెట్టలేకపోయాడు. కథాకథనాలను కాకుండా.. కొన్ని ఎపిసోడ్లను నమ్ముకున్న సినిమా కావడంతో మాస్ ప్రేక్షకులను సైతం ‘పర్వాలేదు’ అనే స్థాయిని మించి ఈ సినిమా అలరించలేకపోయింది.
భాను భోగవరపు దర్శకుడు కావడం కంటే ముందు.. గత కొన్నేళ్లలో టాలీవుడ్ టాప్ కామెడీ ఎంటర్టైనర్లలో ఒకటైన ‘సామజవరగమన’కు రచయితగా పని చేశాడు. అలాంటి నేపథ్యంతో వచ్చిన వాడు దర్శకుడు అవుతున్నాడంటే.. తన సొంత సినిమాలో వినోదాన్ని బాగా పండిస్తాడని ఆశిస్తాం. హీరో ఎలివేషన్లు-యాక్షన్ సీక్వెన్సులు కాకుండా ఎక్కువగా కామెడీ మీదే సినిమాను నడిపించాలని చూశాడు భాను. కానీ నవ్వులు మాత్రం పండలేదు. లేటు వయసులో మనవడిని చికాకు పెడుతూ రొమాంటిక్ వేషాలు వేసే రాజేంద్ర ప్రసాద్ తో చేయించిన కామెడీ కనీస స్థాయిలో కూడా నవ్వించలేకపోయింది. ఇంకోపక్క శ్రీలీల పాత్ర సీరియస్ కావడానికి ముందు కూడా కామెడీనే చేయడానికి ట్రై చేసింది. అదీ ఫలితాన్నివ్వలేదు. హైపర్ ఆది.. అజయ్ ఘోష్ సైతం గట్టిగా ట్రై చేశారు. కానీ నవ్వులు పుట్టలేదు. మొత్తంగా భాను మాస్ కామెడీతో టైంపాస్ చేయించాలన్న ప్రయత్నంలో ఫెయిలయ్యాడు. కానీ అతను రవితేజ మాస్ ఇమేజ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటూ హీరో ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాలను మాత్రం బాగానే వర్కవుట్ చేశాడు. సినిమాలో విలన్ పాత్ర మామూలుగా అనిపించినా.. తన కోసం కిరాతకమైన పనులు చేసే ‘ఫ్యామిలీ’కి సంబంధించిన ట్రాక్ స్పెషల్ అని చెప్పొచ్చు. సినిమా అంతా రొటీన్ అయినా.. ఈ ఒక్క ట్రాక్ సినిమాలో కొత్తగా.. క్యూరియస్ గా అనిపిస్తుంది. ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఆశించే స్పార్క్ అక్కడ కనిపిస్తుంది.
రవితేజ అంటేనే మాస్.. కొన్ని సన్నివేశాలను తన ఇమేజ్ కు తగ్గట్లే పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ తో పాటు ద్వితీయార్ధంలో రెండు మూడు ఎపిసోడ్లు బాగా పేలాయి. సెకండాఫ్ లో ఒక అరగంట మంచి టెంపోతో సాగుతుంది ‘మాస్ జాతర’. రాజేంద్ర ప్రసాద్ పాత్రలో చిన్న ట్విస్ట్ ఇస్తూ చేసిన ఎపిసోడ్ కూడా మాస్ ను అలరిస్తుంది. అలాగే పాటల్ని కూడా మాస్ మెచ్చేలా సందడిగా తెరకెక్కించారు. కానీ ఈ ఎపిసోడ్లను.. మాస్ పాటలను పక్కన పెట్టి చూస్తే మాత్రం ‘మాస్ జాతర’ చాలా సాధారణంగా అనిపిస్తుంది. హీరోను రెగ్యులర్ పోలీస్ లా కాకుండా రైల్వే ఎస్ఐగా చూపించడం ద్వారా కొత్త సీన్లు రాసుకోవడానికి అవకాశమున్నా.. పెద్దగా ఉపయోగించుకోలేదు. ప్రథమార్ధం మరీ రొటీన్ గా.. డల్లుగా సాగడం ‘మాస్ జాతర’కు మైనస్ అయింది. ఇంటర్వెల్ దగ్గర్నుంచి కొంచెం ఊపందుకునే ‘మాస్ జాతర’.. బెటర్ సెకండాఫ్ తో ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కానీ సినిమా అంతా ఒక టెంప్లేట్ మూవీ చూస్తున్న ఫీలింగే కలిగి.. తర్వాత ఏం జరుగుతుందనో క్యూరియాసిటీ ఏర్పడదు. ఓవరాల్ గా రొటీన్ అయినా పర్లేదు కొన్ని మాస్ ఎపిసోడ్లతో సంతృప్తి పడిపోతాం అంటే ‘మాస్ జాతర’పై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.
నటీనటులు:
రవితేజ తన అభిమానులు కొంత కాలంగా మిస్సవుతున్నది ఇచ్చేశాడుే. తనకు టైలర్ మేడ్ అనిపించే పాత్రలో సులువుగా ఒదిగిపోయిన మాస్ రాజా తన ఎనర్జీనంతా చూపించేశాడు. గతంలో కొన్ని సినిమాల్లో తేడా కొట్టిన ఆయన లుక్.. ఈ సినిమాలో మాత్రం చాలా బాగుంది. ‘క్రాక్’ స్థాయి పవర్ ఫుల్ పాత్ర కాదు కానీ.. తనకు నప్పే పోలీస్ పాత్ర కావడంతో రవితేజ కొన్ని సీన్లలో చెలరేగిపోయాడు. కానీ రొమాన్స్.. కామెడీ సీన్లలో మాత్రం రవితేజ సాధారణంగా కనిపించాడు. శ్రీలీలకు మరో రొటీన్ క్యారెక్టర్ పడింది. కాస్తయినా బలం లేని ఇలాంటి పాత్రల్లో ఆమె తేలిపోతోంది. పాటల్లో గ్లామర్.. డ్యాన్సుల విషయంలో శ్రీలీల ఆకట్టుకుంది కానీ.. నటన గురించి చెప్పడానికేమీ లేదు. నవీన్ చంద్ర చేసిన విలన్ పాత్ర సాధారణంగా అనిపించినా.. తన పెర్ఫామెన్స్ బాగుంది. రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ లుక్ ట్రై చేశారు కానీ.. చాలా వరకు తన పాత్ర చికాకు పెడుతుంది. ఆఖర్లో మాత్రం ఆయన కొన్ని నిమిషాలు అలరించారు. హైపర్ ఆది.. అజయ్ ఘోష్ పర్వాలేదు. నరేష్.. మురళీ శర్మ.. సముద్రఖని.. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
భీమ్స్ సిసిరోలియో మూడు మాస్ పాటలతో అలరించాడు. హుషారుగా సాగిన ఆ పాటలు.. తెర మీద కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం మిశ్రమానుభూతి కలుగుతుంది. కొన్ని సీన్లలో ఆర్ఆర్ ఓకే కానీ.. చాలా చోట్ల సన్నివేశానికి బలం చేకూర్చలేకపోయింది. బీజీఎం ద్వారా రావాల్సిన ఊపు రాలేదు. విధు అయ్యన్న ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగానే సాగాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాతలేమీ రాజీ పడలేదు. నందు మాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఇక కథకుడు-దర్శకుడు భాను భోగవరపు.. తొలి సినిమాతో రవితేజ ఇమేజ్ కు సూటయ్యే సగటు మాస్ సినిమా ట్రై చేశాడు. అతడికి మాస్ పల్స్ తెలుసని అర్థమవుతుంది. హీరోయిజం బాగానే పండించాడు. కానీ ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యం.. ఒక ట్రాక్ వరకే పరిమితమైంది. మొత్తంగా కథాకథనాల్లో అలాంటి స్పార్క్ అతను చూపించి ఉంటే సినిమా స్థాయి వేరుగా ఉండేది.
రేటింగ్- 2.5/5


















