నిండు నూరేళ్లు కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు తోడుంటూ పిల్లా పాపలతో, సుఖసంతోషాలతో కలిసి ఉండాల్సిన దంపతులకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వస్తోన్న విషయాలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… గత కొన్ని రోజులుగా వరుసగా హత్యాయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రోజుకో రకం ఘటన తెరపైకి వస్తోంది.
ఫలితంగా వారిలో ఒకరు కాలగర్భంలో కలిస్పోతుంటే.. మిగిలిన వారు కటకటాల పాలవుతున్నారు. ఫైనల్ గా వారికి పుట్టిన పిల్లలు అన్నీ ఉండి అనాథలవుతున్నారు. ఈ విధంగా… కొంతమంది జీవితాల్లో భాగస్వాములే మిలిటెంట్లుగా మారుతున్న పరిస్థితి! ఈ సమయంలో మహారాష్ట్రలో భార్య కోసం బాత్ రూమ్ లో స్పై కెమెరా పెట్టి, బ్లాక్ మెయిల్ చేస్తోన్నారనే భర్త వ్యవహారం తెరపైకి వచ్చింది!
అవును… తన భర్త తన వ్యక్తిగత క్ణాలను రహస్యంగా రికార్డ్ చేయడానికి బెడ్ రూమ్, బాత్ రూమ్ లో స్పై కెమెరాలను ఏర్పాటు చేశాడని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిణి ఒకరు ఆరోపించారు. ఆ వీడియోలతో తనను కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ మేరకు అంబేగావ్ పోలీస్ స్టేషన్ లో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా… ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త కారు లోన్ ఈఎంఐ లు చెల్లించడానికి తన తల్లిదండ్రుల నుండి రూ.1.5 లక్షలు డిమాండ్ చేశాడని అతని భార్య ఆరోపించారు. దీనికి తాను నిరాకరించడంతో.. దాడి చేసి, తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆ సన్నిహిత దృశ్యాలను వైరల్ చేస్తానని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో… ఆమె భర్త, అతని తల్లి, ముగ్గురు సోదరీమణులు, వారిలో ఇద్దరి భర్తలపై భార్తీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్) సెక్షన్ 85, 115(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు! దీనిపై స్పందించిన పోలీసులు.. ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.