టీడీపీ నిర్వహించే అతి పెద్ద పార్టీ కార్యక్రమం మహానాడు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగా వారి అన్నగారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 27-29 మధ్య(మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు) నిర్వహించే మహానాడుకు ఈ ఏడాది కడప వేదిక కానుంది. కడప జిల్లాలో మహానాడును నిర్వహించడం ఇదే తొలిసారి కావడం.. కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. చంద్రబాబుకు 75 వసంతాలు నిండడం వంటి కీలక సమయంలో నిర్వహిస్తున్న మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది.
ఈ క్రమంలో మహానాడును ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన భూమిని కూడా సేకరించి.. కడప జిల్లా కమలాపురంలో పనులు కూడా చేపట్టారు. అయితే.. అనూహ్యంగా భారత్-పాక్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలని అనుకున్నారు. అయితే.. ఉద్రిక్తతలు చల్లారడం.. కాల్పుల విరమణ దిశగా రెండు దేశాలు నడుస్తున్న నేపథ్యంలో తిరిగి మహానాడు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ క్రమంలో మంగళవారం దీనిపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా మహానాడు నిర్వహణకు 5 నుంచి 6 కమిటీలను వేయనున్నారు. వీటిలో పొలిట్ బ్యూరో కమిటీ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అదేవిధంగా భోజనాల కమిటీ, కార్యక్రమ నిర్వహణ కమిటీ, అజెండా కమిటీ, ఏర్పాట్ల కమి టీ, ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ ఇలా.. ఐదు నుంచి ఆరు కీలక కమిటీలను వేయడం ద్వారా పనివిభజన జరగనుంది. తద్వారా మహానాడును విజయవంతం చేయాలని నిర్ణయించారు.
మరోవైపు.. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొంత వరకు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కడప జిల్లా కమ లాపురంలో చేపట్టిన మహానాడు మళ్లీ పుంజుకున్నాయి. రేయింబవళ్లు పనులు సాగుతున్నాయి. నియోజక వర్గం ఎమ్మెల్యేసతీష్ రెడ్డి ఈ పనులను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. తాగునీటి కోసం వందకు పైగా ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున చలువ పందిళ్లు వేస్తున్నారు. సాధారణంగా టెంట్లు వేస్తారు. అయితే.. ఎండవేడిమి నేపథ్యంలో తాటాకు పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు.