జగన్ హాయంలో రోజా మంత్రి అని అందరికీ తెలుసు. కానీ ఆమె ఏ శాఖకు మంత్రి? అనే విషయం నేటికీ చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఆమె నెలకు మూడు నాలుగుసార్లు తిరుమలకి వెళుతుండేవారు కనుక దేవాదాయ శాఖ మంత్రి అనుకున్నవారు కూడా ఉన్నారు.కానీ జగన్ హయంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో జరిగిన అవినీతి భాగోతాలు బయటపడినప్పుడు ఆమె యువజన సర్వీసుల మంత్రనే విషయం చాలా మందికి తెలిసింది. ఆమె పర్యాటకశాఖ మంత్రిగా కూడా చేశారు.అయితే ఆమె మంత్రి పదవిని దాని ద్వారా లభించే గుర్తింపు, ఆర్భాటాలనే చూసుకున్నారు తప్ప రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఆమె చేసిందేమీ లేదు.
విశాఖకు చెందిన వైసీపీ నేత ఒకరు రూ.4-5 కోట్లు (ప్రజా ధనమే) ఖర్చు చేసి ఆర్‌కే బీచ్‌లో అలలపై తేలియాడే చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించారు. కానీ అది అలల ధాటికి అప్పుడే ముక్కలు ముక్కలై ఎందుకు పనికి రాకుండా పోయింది. జగన్ హయంలో పర్యాటక రంగంలో ఏదైనా జరిగిందంటే ఇదొక్కటే.. అదీ అప్పుడే పోయింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగానికి ‘పరిశ్రమ హోదా’ కల్పించి, వందల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తోంది. సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకొని నీటిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సీప్లేన్ సేవలు త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ భరత్ చొరవ తీసుకొని విశాఖకు ‘కార్డేలీయా’ అనే విలాసవంతమైన పర్యాటక నౌక (క్రూజ్)ని సాధించారు. దీని కోసం కేంద్ర పోర్టులు, నౌకాయానం, జల రవాణా శాఖల మంత్రి సార్బానంద సోనోవాల్‌తో మాట్లాడి ఈ క్రూజ్ సర్వీసుని సాధించారు.ఇది విశాఖ- చెన్నై- పాండిచ్చేరి-విశాఖ మద్య తిరుగుతుంది. పర్యాటకుల ఆదరణని బట్టి సర్వీసుల సంఖ్య పెంచుతామని ఏవీ ఎంప్రస్ నౌక యాజమాన్యం తెలిపింది.మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీ కృష్ణ తదితరులు నేడు విశాఖలో ఈ ‘క్రూజ్’ సర్వీసులను ప్రారంభించారు.