నాలుగేళ్లకోసారి క్రికెట్ లో, ఫుట్ బాల్ ప్రపంచ కప్ లు ఉండొచ్చు.. టెన్నిస్ లో ఏడాదికే నాలుగు గ్రాండ్ స్లామ్ లు ఉండొచ్చు.. మధ్యలో కామన్వెల్త్, ఆసియా క్రీడలు అంటూ గేమ్స్ జరగొచ్చు… కానీ, ప్రపంచ క్రీడా సంగ్రామం అంటే మాత్రం ’ఒలింపిక్సే’. ఆ స్థాయిలో ప్రపంచం అంతటినీ ఏకతాటిపైకి తెస్తాయి ఒలింపిక్స్. విశ్వ క్రీడలు అనే పదానికి సరైన అర్థం ఒలింపిక్సే.. నిరుడు పారిస్ లొ ఇదే రోజుల్లో ఒలింపిక్స్ జరిగాయి. తదుపరి ఆతిథ్యం అగ్రరాజ్యం అమెరికాది.
లాస్ ఏంజెలిస్ నగరంలో 2028 ఒలింపిక్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ ఒలింపిక్స్ ప్రత్యేకత ఏమంటే.. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్లీ ప్రవేశించడం. చివరగా 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను నిర్వహించారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ తర్వాత.. క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్ లోకి రావడం గమనార్హం. అయితే, 128 ఏళ్ల కిందట కాబట్టి అప్పట్లో మహిళల క్రికెట్ లేదు. ఇప్పుడు మాత్రం మహిళల క్రికెట్ నూ నిర్వహించనున్నారు.
2028 జూలై 14 నుంచి 30వ తేదీ వరకు ఒలింపిక్స్ జరుగుతాయి. జూలై 14-29 మధ్య టి20 ఫార్మాట్ లో క్రికెట్ మ్యాచ్ లు ఉంటాయి. ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న జట్లతో పాటు ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్టు ఆడనుంది. మొత్తం ఒలింపిక్స్ అంతా ఒకే నెల (2028 జూలై)లో పూర్తి కానుండడం లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రత్యేకత.
ఆర్చరీ పోటీలు జూలై 21-28, అథ్లెటిక్స్ 15-30, బ్యాడ్మింటన్ 15-24, బాక్సింగ్ 15-30, షూటింగ్ 15-25, వెయిట్ లిఫ్టింగ్ 25-29, టెన్నిస్ 19-28, రెజ్లింగ్ 24-30 తేదీల్లో జరుగుతాయి. -2032 ఒలింపిక్స్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ దేశంలోని బ్రిస్బేన్ నగరంలో జరిగే ఈ పోటీలు జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నారు.
మరోవైపు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత దేశం బిడ్ దాఖలు చేసింది. అహ్మదాబాద్ లో ఆతిథ్యం ఇస్తామని ప్రతిపాదించింది. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయితే ఏ దేశానికి ఆతిథ్యం దక్కనుందో తెలుస్తుంది.