ప్రధాని మోదీతో టీడీపీ భావినేత, ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జీఎస్టీ సంస్కరణలు, రాష్ట్రానికి నిధులు అంటూ ఏవేవో కారణాలు చెబుతున్నా, ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీకి ప్రధానంగా రాజకీయ కారణాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. దేశంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీ, ఏపీలో తిరుగులేని స్థితిలో ఉన్న టీడీపీ పరస్పర ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు ఈ సమావేశాల ద్వారా తెలుస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని అపాయింటెమ్మెంట్ కోసం సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితుల్లో మంత్రి లోకేశ్ నుంచి విన్నపం వెళ్లగానే పీఎం మోదీ సమయం కేటాయిస్తుండటం విశేషంగా చెబుతున్నారు.
ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ కావడం ఇది రెండో సారి. ప్రధాని ఆహ్వానం మేరకు గత మే నెలలో ఒకసారి లోకేశ్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. శుక్రవారం కూడా రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకంటూ ఢిల్లీ వెళ్లిన మంత్రి లోకేశ్ ప్రధానితో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బిజీ షెడ్యూల్ లో కూడా ప్రధాని మోదీ మంత్రి లోకేశ్ తో అంత సమయం గడపడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి నిధుల సాధనే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటలు ఉంటున్నట్లు టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఒక సాధారణ మంత్రిగా ఉన్న లోకేశ్ కు ఢిల్లీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు ఇతర కేంద్ర మంత్రులు ప్రాధాన్యం ఇవ్వడం చిన్న విషయమేమీ కాదంటున్నారు.
టీడీపీ భావి నేత లోకేశ్ ను మచ్చిక చేసుకోడానికే బీజేపీ పెద్దలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో బలమైన బంధం కొనసాగించేందుకు టీడీపీ కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలిస్తోందని అంటున్నారు. వాస్తవానికి మంత్రి లోకేశ్ ను ప్రధాని మోదీయే ముందుగా ఢిల్లీ రమ్మని ఆహ్వానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని మోదీ, ఢిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా మంత్రి లోకేశ్ ను ఆహ్వానించారు. అయితే ప్రధాని పిలిచినా లోకేశ్ వెళ్లకపోవడంతో గత మే నెలలో అమరావతి పనులు పునఃప్రారంభానికి వచ్చిన ప్రధాని మోదీ ఈ విషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నట్లు బహిరంగ వేదికపైనే చెప్పారు.
దీంతో అదే నెలలో మంత్రి లోకేశ్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. అప్పట్లో దాదాపు గంటకు పైగా ప్రధాని నివాసంలో గడిపిన లోకేశ్.. రాష్ట్ర రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధానితో చర్చించారని అంటున్నారు. చిన్న వయసులోనే లోకేశ్ ఎంతో అవగాహన పెంచుకున్నారని భావించిన ప్రధాని మోదీ అప్పటివరకు లోకేశ్ పై ఉన్న అభిప్రాయాన్ని సవరించుకున్నారని అంటున్నారు. ఈ విషయంపై తన సహచరుల వద్ద కూడా చర్చ జరిగిందని, టీడీపీకి ఏపీకి లోకేశ్ భావి నాయకుడిగా వారు గుర్తించారని అంటున్నారు. అందుకే హోదా ప్రకారం లోకేశ్ రాష్ట్ర మంత్రి అయినప్పటికీ, ఆయనకు రాష్ట్ర ప్రతినిధిగానే పరిగణిస్తున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీ అధిష్టానంతో మెరుగైన సంబంధాలను ఆశిస్తూ ఆ పార్టీ నేతలు అందరితోనూ లోకేశ్ కు పరిచయాలు పెరిగేలా వ్యూహం రచించారని అంటున్నారు. అందుకే ఢిల్లీ పర్యటనలకు తాను దూరంగా ఉంటూ, లోకేశ్ ద్వారా రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై మంత్రాంగం నడుపుతున్నారని అంటున్నారు. దీనివల్ల రాజకీయంగా లోకేశ్ కు మరింత అనుభవం వచ్చే అవకాశంతోపాటు ప్రజల్లో కూడా లోకేశ్ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఉభయ పార్టీలకు లాభదాయకంగా కనిపిస్తుండటంతో ఆయనకు ఢిల్లీలో రానురాను ప్రాధాన్యం పెరుగుతోందని అంటున్నారు.