ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలల తర్వాత మరో ప్రధాన ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేడి చల్లారక ముందే కూటమి Vs వైసీపీ మధ్య మళ్లీ ఎన్నికల పోరు జరగనుంది. ఈ ఎన్నికల ద్వారా తమ బలం మరింత పుంజుకుందని నిరూపించుకునేలా కూటమి ప్లాన్ చేస్తుండగా, గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కోలుకున్నామని, ప్రజల్లో తమ పట్ల ఆదరణ పెరిగిందని నిరూపించుకునేలా వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించాల్సివుందని అంటున్నారు. 15 నెలల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల నుంచే చెబుతున్న మాజీ సీఎం జగన్.. తన మాటలు నిజమని నిరూపించుకునే అవకాశం దక్కిందని అంటున్నారు.
రాష్ట్రంలో మరో ఎన్నికల రణ రంగానికి కార్యాచరణ సిద్ధం చేసింది ప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న స్థానిక ఎన్నికలకు మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. దీంతో మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యుద్ధం జరగనుందని అంటున్నారు. ఆ తర్వాత వరుసగా పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోందని అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రాతినిధ్యం ఉంది. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలు ఏకపక్షమయ్యాయి. అప్పట్లో వైసీపీ ప్రత్యర్థులు నామినేషన్ వేయలేని పరిస్థితులు కల్పించడంతో తాము ఎన్నికలు బహిష్కరించామని, అందుకే వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచి గత ఎన్నికల్లో ప్రజా బలంతోనే గెలిచామని రుజువు చేసుకోవాలని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుత పాలకవర్గాలకు వచ్చే ఏడాదిలోనే పదవీకాలం ముగియనుంది. అయితే కొన్నిచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలసలను ప్రోత్సహించి ఆయా స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే పదవీకాలం గడువు సమీపించడంతో ఈ ఆపరేషన్ ఆపేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ప్రభుత్వం ఎన్నికలకు కార్యాచరణ ప్రారంభించిందని అంటున్నారు.
వచ్చేఏడాది మార్చిలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పదవీకాలం ముగియనుంది. అదేవిధంగా ఏప్రిల్ లో పంచాయతీలకు గడువు తీరిపోనుంది. అయితే మార్చిలో నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలను జనవరిలోనూ.. ఏప్రిల్ లో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలను జూన్ లో చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే నెల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించిన కమిషన్ ముందుగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది. ఇందుకోసం వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇక అదేనెల 16 నుంచి నవంబరు 15వ తేదీ వరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించింది. నవంబరులో ఎన్నికల అధికారుల నియామకం, పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంల నిర్వహణ అన్నీ నవంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించింది. ఇక డిసెంబరు 15లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది. దీంతో జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.