రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి.. మూడో రోజే లాభాల్లోకి.. ఇలా జరిగి చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ ఆ ఫీట్ అందుకుని దూసుకుపోతోంది. ఘాటీ, మదరాసి వంటి స్టార్ క్యాస్టింగ్ నటించిన సినిమాలతో కలిసి రిలీజ్ అయిన ఆ సినిమా తేలిపోతుందనుకుంటే.. వాటిని వెనక్కి నెట్టి దూసుకుపోతోంది.
కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మరోసారి నిరూపించింది. భారీ తారాగణం ఉన్న సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. అయితే మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగరం జంటగా నటించిన ఆ మూవీకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ సంస్థతో కలిసి ఆదిత్య హాసన్ నిర్మించారు.
రూ.కోటిన్నర వ్యయంతో రూపొందిన లిటిల్ హార్ట్స్ మూవీ.. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ తో తెరకెక్కించారు. అయితే ఫన్ వర్కౌట్ అవుతుందని అనిపించడంతో నిర్మాత బన్నీ వాసు వద్దకు తీసుకెళ్లారు మేకర్స్. ఆయనకు నచ్చడంతో వంశీ నందిపాటితో కలిసి థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి రిలీజ్ చేశారు.
రెండున్నర కోట్లకు రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేయగా.. సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. అది ఫస్ట్ రోజు ఫుల్ గా స్ప్రెడ్ అయింది. రూ. 1.35 కోట్లకుపైగా ఓపెనింగ్స్ రాబట్టిన లిటిల్ హార్ట్స్.. రెండో రోజు భారీ వసూళ్లు సాధించింది. రూ.రెండున్నర కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక ఆదివారం అయితే అదరగొట్టేసింది. మూడున్నర కోట్ల (రూ. 3.65 కోట్లు) రాబట్టి.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వెళ్ళిపోయింది. గ్రాస్ విషయానికి వస్తే 10 కోట్ల రూపాయలు దాటిందని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే లిటిల్ హార్ట్స్ రూ.10 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయింది. మరికొన్ని రోజుల్లో రూ.25 కోట్ల మార్క్ అందుకోనుందని అర్థమవుతుంది.
తెలుగు రాష్ట్రాలతోపాటు యూఎస్ లో కూడా అదరగొడుతోంది. వీకెండ్స్ లో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. షోలు పెరుగుతున్నాయి. కానీ టికెట్స్ దొరకడం లేదు. అంతలా ఆడియన్స్ ఎగబడి సినిమాను చూస్తున్నారు. మొత్తానికి చిన్న మూవీగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. బన్నీ వాసు, వంశీ నందిపాటిల పంట పండించింది. మరి ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో వేచి చూడాలి.