కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ బస్సు ‘వి కావేరి’ (వేమూరి కావేరి) యాజమాన్యం బస్సుగా అధికారులు నిర్ధరించారు.ఈ విషయంపై వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రతినిధి కూడా మీడియాతో మాట్లాడారు.ఇంతకీ, ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాని ఎవరు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ‘వేమూరి కావేరి’ ట్రావెల్స్ పేరిట ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి.గతంలో కావేరి ట్రావెల్స్ పేరుతో సంస్థ నడపగా.. అందులో ఉన్న ముగ్గురు పార్టనర్స్ విడిపోయినట్లుగా ‘వి కావేరి’ యాజమాన్యం ప్రతినిధులు చెబుతున్నారు.ఇలా విడిపోయిన క్రమంలో తెలంగాణలోని పటాన్ చెరు కేంద్రంగా వేమూరి కావేరి ట్రావెల్స్ ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నారు.
తెలంగాణ ఆర్టీవో రికార్డుల ప్రకారం.. కంపెనీ యజమానిగా వేమూరి వినోద్ కుమార్ పేరు ఉంది. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పామూరు.అయితే, తాజాగా ప్రమాదానికి గురైన బస్‌ను ఒడిశాలోని రాయగడలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమయంలో వినోద్ కుమార్ తన చిరునామాను రాయగడలోని సాయి లక్ష్మీనగర్‌లో చూపించారని తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.వినోద్ కుమార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది.. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.
అయితే, ‘వి కావేరి’ ట్రావెల్స్ యాజమాన్యానికి చెందిన సుమారు 70 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయని కంపెనీ ప్రతినిధి వేమూరి వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు. వీటిల్లో స్లీపర్, సీటర్ బస్సులు ఉన్నాయి.హైదరాబాద్‌లోని పటాన్‌చెరు నుంచి బస్సులు ఆపరేట్ చేస్తుంటారు.బస్సులు ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ పట్టణాలు, నగరాలకు నడుస్తున్నాయి.ఇవి కాకుండా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, పుణె, శిర్డీ, గోవా, ముంబయి, మంగళూరు, నాగ్‌పుర్ వంటి ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు నడుపుతున్నట్లుగా వేమూరి కావేరి ట్రావెల్స్ వెబ్‌సైట్ బట్టి తెలుస్తోంది.
అలాగే బస్సులు ఎక్కువగా ఒడిశా, నాగాలాండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, దమన్ అండ్ దీవ్ వంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా వెబ్‌సైట్‌లోని బస్సుల ఫొటోల ఆధారంగా స్పష్టమవుతోంది.ముఖ్యంగా గతంలో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ బస్సులకు రిజిస్ట్రేషన్ లేకపోవడం, తర్వాత అనుమతులు వచ్చినప్పటికీ ట్యాక్స్ ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు ప్రైవేటు ట్రావెల్స్ యజామానులు.మరోవైపు ప్రమాదానికి గురైన వేమూరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ – బెంగళూరు మధ్య నడుస్తోంది.
ఈ బస్సుకు సీటర్ పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్చి నడుపుతున్నారని కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై, బస్సు మొదటగా రిజిస్ట్రేషన్ అయిన మేడ్చల్ రవాణాశాఖ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.బస్సుకు 2018లో మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిందని మేడ్చల్ జిల్లా రవాణా శాఖాధికారి రఘునందన్ గౌడ్ చెప్పారు.”బస్సు 2023 మార్చి 31 నుంచి ‘దమన్ అండ్ దీవ్’కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది” అని చెప్పారు.మొదట్లో మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 53 సీట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రఘునందన్ గౌడ్ చెప్పారు.
”దమన్ అండ్ దీవ్‌కు మార్చాక అక్కడ ఎలాంటి ఆల్ట్రేషన్ చేశారనే విషయంపై మాకు స్పష్టత లేదు. ఇక్కడ ఉన్నప్పుడు సీటర్ పర్మిషన్‌తోనే నడిచింది. తర్వాత స్లీపర్ పర్మిషన్ తీసుకున్నారా? లేదా అన్నది మాకు సమాచారం లేదు” అని చెప్పారు.అయితే, బస్సు వివరాలను అధికారులతో విచారించినప్పుడు, దామన్ అండ్ దీవ్ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడలో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా చెప్పారు రవాణాశాఖ అధికారులు.
ఒడిశా ఆర్టీవో నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ ఏడాదిలోపు రానుంది, దీంతో అప్పటివరకు పాత నంబరు డీడీ01 ఎన్ 9490తో తిప్పుతున్నట్లుగా చెప్పారు అధికారులు.
బస్సుకు ఫిట్‌నెస్ 2027 మార్చి 31 వరకు, ఇన్సూరెన్స్ 2026 ఫిబ్రవరి 24 వరకు, రోడ్ ట్యాక్స్ వ్యాలిడిటీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉన్నట్లుగా యాజమాన్యం ప్రతినిధి వేమూరి వెంకటేశ్వర్లు మీడియాతో చెప్పారు.
డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ : 2018లో స్కానియా సంస్థ నుంచి తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్వోసీ తీసుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరి సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్‌లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూ డామన్‌లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరి ట్రావెల్స్ ఒడిశాలో అల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించింది.
అక్కడి అధికారులు అల్ట్రేషన్, ఫిట్‌నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్ద్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ వీ కావేరి ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారీయర్‌గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్ధ్యాన్ని అధిగమించడమే. రవాణా ట్యాక్స్ ఒక్క సీట్‌కు రూ. 450 మాత్రమే. అదే స్లీపర్ సీట్ అయితే రూ. 800 అవుతుంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీట్‌కు రూ.4,500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీట్‌కు అయితే రూ.12 వేల చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి.
ఇలా ట్యాక్స్‌లను ఎగవేసేందుకే వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్ట్రేషన్ చేయించింది. వేమూరి కావేరి సంస్థ మరో అక్రమాన్ని కూడా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బస్సుకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉంది. అంటే కేవలం టూరిస్ట్ ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి. పర్యాటక ప్రాంతాలకు టూరిస్ట్‌లను చేరవేసే సంస్థ రెగ్యులర్ ప్రయాణికులను సర్వీస్ నిర్వహించడం కూడా చట్ట విరుద్ధమే. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉన్న బస్సును తామే సీజ్ చేసే అధికారం ఉండదని తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు చెప్పడం ఈ ఘటనలో కొసమెరుపు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చాలా బస్సులు తిరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహించే ట్రావెల్స్ బస్సులను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల వల్ల ఆ రాష్ట్రాల్లో తక్కువ ధరకు ఆల్ ఇండియా పర్మిట్ ఇస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా అనుమతులకు విరుద్ధంగా సర్వీసులు నిర్వహించడం మరో సమస్యకు కూడా కారణం అవుతోంది. సీటింగ్ పర్మిషన్ ఉన్న బస్సును స్లీపర్‌గా మార్చడంతో కర్నూలు ప్రమాదంలో బాధితులకు బీమా సౌకర్యం కూడా దొరకడం కష్టంగా మారే అవకాశముంది.














