*ఐదేళ్లపాటు ఎక్కడ నిద్రపోయారు జగన్మోహన్ రెడ్డి?*
*kwdt-2 నియామకానికి కారకులు మీరు కదా?*
*రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసింది మీ నిర్వాకమే*
*చౌకబారు విమర్శలు తగవు అంటూ జగన్ లేఖపై నిమ్మల ధ్వజం*
కృష్ణానది జల వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్-2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాసిన లేఖపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో జల వనరులకు సంబంధించి జగన్ వైఖరిని తూర్పారబట్టారు.దెయ్యాలు వేదాలు వల్లించడం, దొంగే దొంగ దొంగ అని అరవడం మాదిరి రాష్ట్ర ప్రయోజనాలను తను దెబ్బ కొట్టి కూటమి ప్రభుత్వం పై బురద చల్లడం విడ్డూరంగాను వింతగాను ఉందన్నారు.ఐదేళ్లపాటు అధికారమిస్తే.. అప్పుడు ఎక్కడ నిద్రపోయారు.. జల వనరులపై మీరు ఇప్పుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమ అప్పుడు ఏమైపోయింది అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అతి కీలకమైన నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది మీరు కదా?రాష్ట్ర జీవనాడి ‘పోలవరం’ తో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులన్నిటిని నిర్వీర్యం చేసి పడుకోపెట్టేసింది మీరు కాదా? అంటూ నిలదీశారు మీ తిరోగమన పాలన వల్ల, అసమర్ధ అవినీతి విధానాల వల్ల రాష్ట్ర జలవనుర్లన్నీ అధోగతి పాలవడం వాస్తవం కాదా అని అడిగారు . సదరు ప్రాజెక్టులన్ని పాతికేళ్లు వెనక్కి వెళ్ళి పోవడానికి కారకులు మీరేనని విమర్శించారు.
ప్రస్తుతo మీరు వలకబోస్తోన్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణానది జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (KWDT)-2 వేయడానికి, దాని అంకురార్పణకు మీ చేతకానితనం కాదా అని నిలదీశారు. 2020లో అధికారంలో ఉన్నది మీరు, తెలంగాణకు కెసిఆర్. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలు తుంగలో తొక్కి మన రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడుతుంటే మీరు ఎపెక్స్ కౌన్సిల్లో నిద్రపోయారా అంటూ మంత్రి రామానాయుడు నిలదీశారు. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వాదనల మేరకు కృష్ణా జలాల పంపిణీ పునర్విభజన చట్టం.. దశాబ్దాల తరబడి ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన కాకుండా .. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ప్రాతిపదికన జరగాలని కోరినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఎందుకు మౌనం దాల్చారు అంటూ రామానాయుడు సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కే డబ్ల్యూడిటీ-2 ఏర్పాటు అయింది అన్నారు. పోనీ తర్వాత అయినా స్పందించారా.. అంటే అది లేదు. 2023లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ కి సిద్ధపడిన వేళ కూడా తమరు నోరు మెదపలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టపరంగా నదీ జలాల పంపిణీ యథాతథంగా అమలు చేయాలని మీరు కనీసం కేంద్రాన్ని కోరనైనా కోరలేదని దుయ్యబట్టారు.కే డబ్ల్యు డి టి -2 ఏర్పాటు తగదంటూ సుప్రీంకోర్టు కైనా వెళ్లారంటే అదీ లేదు.. ఆ రకంగా మూడేళ్లపాటు కాలయాపన చేశారు.. ఎన్నికలవేళ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కంటి తుడుపు చర్యగా సుప్రీంకోర్టులో రిట్ వేయడం వాస్తవం కాదా అని అడిగారు.
ఈ రకంగా కే డబ్ల్యూ డి టి- 2 ఏర్పాటుకు ముమ్మాటికి జగనే కారణం అని నిమ్మల నొక్కి వక్కాణించారు.
రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టిఎంసిల నీటిని కేటాయిస్తే.. అందులో మన రాష్ట్ర వాటాగా 512 టిఎంసిలను రాబట్టారు. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు.. ఆనాడు ఆ రకంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారని మంత్రి వివరించారు.
అలాగే గోదావరి వరద జలాలు 80 టీఎంసీలకు సంబంధించి 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించగా మిగిలిన 45 టీఎంసీలు మన రాష్ట్రానికి దక్కాయి అని అన్నారు. ఆ 45 టీఎంసీలు కూడా మాకే కావాలని తెలంగాణ వాదించినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని మంత్రి ప్రశ్నించారు. సి డబ్ల్యూ సి లో 20 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ఏకే గోయల్ ని k wdt-2 ముందు వాదనలకు నియమించగా అతని పనితీరును కూడా జగన్ విమర్శించడం దురదృష్టకరమని అన్నారు.అలాగే రాయలసీమ ప్రాజెక్టుల గురించి జగన్ మొ సలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల దుష్ట పాలనలో రాష్ట్రం మొత్తం మీద 198 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారన్నారు. అందులో 102 రాయలసీమలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశాడని మంత్రి రామానాయుడు విమర్శించారు. 2014 -19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులకు 12000 కోట్లు కేటాయించగా.. 2019 24 మధ్య జగన్ హయాంలో కేవలం 2000 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. రాయలసీమకు నాటి కృష్ణదేవరాయలు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే జలకళ ఉట్టిపడుతోందన్నారు. రాయలసీమ రతనాల సీమ చేయాలని ధ్యేయంతో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. అలాగే రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించిందీ గణాంకాలతో సహా మంత్రి వివరించారు.
పరదాల మాటున పాలన సాగించిన అలవాటున్న జగన్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటే స్పష్టమైన సమాధానాలుహితవు పలికారు. రాజకీయంగా మసక బారి పోయిన పార్టీని కాపాడుకోవడానికి , ఉనికిని చాటుకోవడానికి చౌకబారు విమర్శలు చేయడం, లేఖలు రాయడం జగన్మోహన్ రెడ్డి పలాయన వాదాన్ని సూచిస్తోందని అన్నారుప్రజల ముందుకు రాలేక ముఖం చాటేస్తున్న జగన్ నైజాన్ని, ఆంతర్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని నిమ్మల విశ్లేషించారు. లేఖల రాజకీయం మాని జల వనరులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు.













