పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇక ఈ సినిమాకు మూలకర్త, మొదటి దర్శకుడు క్రిష్ జగర్లమూడి. ప్రాజెక్ట్ ప్రారంభంలో 70 శాతం వరకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, ఆపై వివిధ కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. అనంతరం జ్యోతికృష్ణ సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇచ్చారు. ఎ.ఎం. రత్నం నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ ఓ ఎమోషనల్ ఓపెన్ లెటర్ రాసి, పవన్ కళ్యాణ్, ఎ.ఎం. రత్నం గురించి పాజిటివ్ గా స్పందించారు. ‘‘హరి హర వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అది సైలెంట్‌గా కాదు, ఒక మంచి పర్పస్‌తో, చరిత్ర బరువుతో, ప్రతి ఫ్రేమ్‌లోనే ప్యాషన్‌తో వస్తోంది. ఈ ప్రయాణాన్ని గొప్ప లెజెండ్స్ సాధ్యపరిచారు. వాళ్లు కేవలం సినిమా వేదికపై మాత్రమే కాదు, కంటెంట్ లోను దిగ్గజాలే’’ అంటూ క్రిష్ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు.
పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ, ‘‘మన పవన్ కళ్యాణ్ గారు… ఒక శక్తి. ఆయన్ను పరమాత్మ దీవించాడనిపిస్తుంది. ఆయనలోని ఫైర్ ఎటువంటి కెమెరా కూడా పూర్తిగా పట్టుకోలేను. ఆయనకు ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. ఆయన్ని ముందుకు నడిపించే శక్తి ‘హరి హర వీరమల్లు’కి ప్రాణం, ప్రాధాన్యం, పవర్‌ను ఇచ్చింది. ఈ సినిమాలో పునాది, ప్రాణం, తుఫాన్ అన్నీ ఆయనదే’’ అని అభినందించారు. నిర్మాత ఎ.ఎం. రత్నం గురించి మాట్లాడుతూ, ‘‘భారతీయ సినిమాకు అతిపెద్ద అనుభవాలను అందించిన ఆర్కిటెక్ట్. సినిమాలను ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నిర్మించే గొప్పతనం ఆయనదే. వీరమల్లు అందరినీ ఆకట్టుకునే స్థాయిలో సిద్ధమవ్వడంలో ఆయన పాత్ర అపూర్వం’’ అని వివరించారు. ‘‘ఈ సినిమా నాకు కేవలం డైరెక్టర్‌గా కాదు, ఒక చరిత్ర అన్వేషకుడిగా, ఓ నిజని చూడాలనే వ్యక్తిగా, ప్రపంచాన్ని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో తీసిన గొప్ప పోరాటం ఇది. వినోదం, విజ్ఞానం రెండింటినీ కలిపి ఇవ్వాలనే ఆశయంతో రూపొందించాను. నా జీవితంలో ఇదొక మధురమైన ప్రయాణం’’ అని క్రిష్ అభిప్రాయపడ్డారు.
ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్న పవన్ కళ్యాణ్, ఎ.ఎం. రత్నం గార్లకు నా మనఃపూర్వక ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన ఈ తపన, ఈ విశ్వాసం, ఇప్పుడు ఫలంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… అంటూ క్రిష్ హృదయాన్ని తాకే కామెంట్స్ తో పాజిటివ్ హైప్ క్రియేట్ చేశారు. క్రిష్ రూపొందించిన ఈ గొప్ప కథను, పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన జ్యోతికృష్ణ అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పవర్‌తో, ఎ.ఎం. రత్నం స్ఫూర్తితో, జూలై 24న ప్రేక్షకులకు నూతన అనుభూతిని ఇవ్వబోతున్నారు. మరి సినిమా అంచనాల స్థాయిని ఏ లెవెల్లో అందుకుంటుందో చూడాలి.