విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య ఏర్పడిన తీవ్ర వివాదాన్ని పరిష్కరించే దిశగా టిడిపి నాయకత్వం అడుగులు వేస్తోంది. దీనిని పెంచి పెద్దది చేయకుండా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి రాగానే అప్పటికే దుబాయ్ లో ఉన్నప్పటికీ వెంటనే స్పందించారు. ఎవరికి వాళ్లు సైలెంట్ అవ్వాలని తాను వచ్చాక చూసుకుంటానని చెప్పారు.
అనంతరం ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత తుఫాను ప్రభావం ఉండటంతో వారం రోజులు పాటు ఈ విషయాన్ని పక్కన పెట్టారు. తిరిగి లండన్ పర్యటనకు వెళ్లే క్రమంలో ఇద్దరు నాయకులను క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించారు. క్రమశిక్షణ సంఘం వారి నుంచి వివరణ తీసుకుని తమకు నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో తాజాగా ఇద్దరు నాయకులను కూడా క్రమశిక్షణ సంఘం నేతలు పిలిచారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు.
అయితే ఎవరికి వారుగా తమకు చంద్రబాబు అంటే అభిమానమని ఆయన అంటే దేవుడని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఒకరిపై ఒకరు మళ్ళీ ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం నాయకులు నివేదికను సిద్ధం చేశారు. ప్రధానంగా పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిర్గతం చేయడం పట్ల కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో క్రమశిక్షణ సంఘం ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ మేరకు నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
అదేవిధంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను అని చెబుతూ లేనిపోని విషయాలను కూడా ప్రజల మధ్య తీసుకురావడం బహిరంగంగా ప్రకటనలు చేయడం పార్టీ అనుమతి లేకుండానే టీవీ ఛానల్ లో నిర్వహించే డిబేట్లో పాల్గొనడం వంటివి కూడా శ్రీనివాసరావుకు మైనస్ అయినట్టు తెలుస్తుంది. ఆయా విషయాలను కూడా క్రమశిక్షణ సంఘం తమ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు ఎంపీ కేసినేని శివనాథ్ కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు.
ఆయన కూడా చంద్రబాబును దేవుడనే చెప్పారు. చంద్రబాబు గీసిన గీత దాటనని వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడిపై ఈయన కూడా విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా తనపై ఎలాంటి ఆరోపణలు చేసినా ఇబ్బంది లేదని కానీ పార్టీని పార్టీ అధినేతను ఇబ్బంది పెట్టేలా కొలికిపూడి వ్యవహరించారన్నది ఆయన వాదన. మొత్తానికి ఈయన నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ సంఘం ఆ వివరాలు కూడా నివేదికలో పొందుపరిచింది.
మొత్తంగా ఈ వ్యవహారం దాదాపు సమసిపోయిందన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు రాష్ట్రానికి రాగానే ఈ విషయాన్ని ఆయన ముందు పెట్టి అనంతరం చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


















