తెలంగాణ రాజకీయాలు కల్వకుంట్ల కవిత చుట్టూ మరోసారి ఉత్కంఠగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి ఆమె తొలగింపు.. పార్టీలోని కీలక నేతలపై కుట్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె తదుపరి అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రాజకీయ వాతావరణంలో ఆమె వేసుకున్న ఒక సాధారణ సారీ సోషల్ మీడియాలో ‘రాజకీయ చర్చ’కు తెరలేపింది
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలో కవిత కనిపించిన తీరు చర్చకు దారితీసింది. ఆమె సాధారణంగా ధరించే సాదాసీదా, ఒకే రంగు చీరలకు భిన్నంగా ఈసారి ‘ఆఫ్ వైట్ కలర్ సారీ’ ధరించారు. దీనికి పాలుపచ్చ–ఎరుపు రంగుల బార్డర్ ఉండటం విశేషం. సాధారణంగా పబ్లిక్ ఈవెంట్స్‌లో కవిత డ్రెస్సింగ్ సింపుల్‌గా ఉంటుంది. అయితే ఈసారి ఆమె ఎంచుకున్న కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్, ఎరుపు, , ఆకుపచ్చ రంగులు సోషల్ మీడియాలో వేరే రకంగా విశ్లేషించబడుతోంది.
కవిత సారీలోని ఆఫ్ వైట్ (తెలుపు), ఎరుపు, ఆకుపచ్చ కలర్ కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను పోలి ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై “ఇది కేవలం ఫ్యాషన్ మార్పు కాదా? త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే సంకేతమా?”…అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి వైదొలిగిన తర్వాత కవిత తన కొత్త రాజకీయ ప్రయాణానికి ఈ కలర్ స్కీమ్ ద్వారా ‘కోడ్ లాంగ్వేజ్’ వాడుతున్నారేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.
కవిత సారీ ఎంపికపై ప్రస్తుతం రెండు ప్రధాన వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ఇమేజ్ కోసం బీఆర్‌ఎస్ నుంచి వైదొలిగిన తర్వాత, కవిత తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. ఫ్యాషన్ నిపుణుల ప్రకారం, తెలుపు (వైట్) రంగు క్లారిటీ, కొత్త ఆరంభం, నిష్కళంకతను సూచిస్తుంది. రాజకీయాల్లో ఈ విధమైన సింబాలిక్ ఫ్యాషన్ ఎంపికలు తరచుగా కనిపిస్తాయి. ఎరుపు–పచ్చ–తెలుపు కాంబినేషన్ కాంగ్రెస్ జెండాను గుర్తు చేస్తుందనే వాస్తవాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కుట్ర ఆరోపణల నేపథ్యంలో, కవిత కొత్త రాజకీయ వేదిక ను ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంటే, ఈ కలర్ ఎంపిక ఒక బలమైన సంకేతం కావచ్చు.
కొందరు భావించినట్లుగా, కవిత ఈ సారీని భట్టి విక్రమార్క ఇంటి వేడుక కోసమే ప్రత్యేకంగా ఎంచుకోలేదు. ఆమె అదే సారీని ఈవెంట్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కూడా ధరించారు. అయినప్పటికీ, ఆమె డ్రెస్సింగ్ ఎంపికపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలు, దానికి రాజకీయ అర్థాన్ని ఆపాదించి, దాన్ని ‘స్పెషల్’ గా మార్చేశాయి.
ఒక సారీని కూడా పొటెన్షియల్ పొలిటికల్ స్టేట్‌మెంట్గా విశ్లేషించడం… కవిత రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఆమె స్వంత పార్టీని ఏర్పాటు చేస్తారా? లేక కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా? పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తేలనుంది. ఏదేమైనా కేవలం ఒక సారీతో రాష్ట్రవ్యాప్తంగా చర్చను ప్రారంభించడంలో కవిత మరోసారి విజయవంతమై ట్రెండింగ్ పాయింట్ అయ్యారనడంలో సందేహం లేదు.


















