తెలంగాణ రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కవిత ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చినట్లేనని చెప్పాలి. గడిచిన రెండు రోజుల్లో ఆమె పూర్తిగా ఓపెన్ కావటమే కాదు.. తన శత్రువులు కం ప్రత్యర్థులు ఎవరన్న విషయాన్ని చెప్పేశారు. తాను కత్తి దూసే వారెవరు? అందుకు మినహాయింపు ఎవరన్న విషయాన్ని ఆమె చెప్పేశారు. అదే సమయంలో తన తండ్రికి.. తన అన్నకు సుద్దులు చెప్పిన తీరే హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ లాంటి సీనియర్ రాజకీయ నేతకు ఎవరేంటో చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉందా? కేసీఆర్ పొలిటికల్ జర్నీని చూస్తే.. అందులో కనిపించే ఎత్తు పల్లాలు అన్ని ఇన్ని కావు. వాటిని ఆయన ఎంతలా తెలివిగా అధిగమించారో అందరికి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసి.. సొంతంగా పార్టీ పెట్టి.. ఎప్పటికి సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేయటం.. పార్టీని అధికారంలోకి తీసుకురావటం.. తిరుగులేని విధంగా పదేళ్లు పాలించటం ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసీఆర్ రాజకీయం జీవితం మొత్తం గతుకుల మయం. ఆయన ఎప్పుడు ఏం చేయాలో? ఏం చేయకూడదన్న విషయంపై ఉన్న క్లారిటీ అంతా ఇంతా కాదు.
తన చుట్టు ఉన్న వారిలో ఎవరిని ఎంతమేర వాడాలి? ఎంత మేర దగ్గరకు తీసుకోవాలి?ఎవరిని ఎప్పుడు దూరం పెట్టాలన్న దానిపై కేసీఆర్ కు ఉన్నంత స్పష్టత మిగిలిన వారికి ఉండదనే మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాతకు సుద్దులు నేర్పిన చందంగా.. కేసీఆర్ లాంటి రాజకీయ పార్టీ అధినేతకు ఆయన కుమార్తె పాఠాలు చెప్పటం.. అలెర్టు చేయటానికి మించిన కామెడీ మరేం ఉంటుంది?
కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి దాన్ని తుంచేయాలని.. దాని ఉనికి లేకుండా చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అన్నిసార్లు ఫెయిల్ అయ్యాయి. అంతేకాదు.. రాజకీయంగా ఆయన్ను దెబ్బ తీసేందుకు చేసిన కుట్రలు అన్ని ఇన్ని కావు. వీటిని తట్టుకున్న కేసీఆర్ కు.. పార్టీలో ఉన్న ఇంటి దొంగలు ఎవరు? వారిని ఎప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి? అన్న విషయాలు కుమార్తె కవిత చెబితే కానీ తెలీకుండా ఉంటుందా?
మొన్నటివరకు తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేసిన కవిత.. తాజాగా చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు ఒక తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మొన్నటివరకు తండ్రిని పల్లెత్తు మాట అనని ఆమె.. తాజాగా మాత్రం ఆయనతో పాటు తన సోదరుడు కేటీఆర్ ను చేర్చటం కనిపిస్తుంది. హరీశ్.. సంతోష్ లు మేకవన్నె పులలు అని.. తనను ఈ రోజు పార్టీ నుంచి బయటకు పంపారని.. రేపు రామన్నకు.. మీకు ఇదే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కేసీఆర్ కే పత్రికాముఖంగా చెప్పే ధైర్యం కవిత చేయటం మామూలు విషయం కాదనే చెప్పాలి.
తన తండ్రి ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం చేయని దానికి భిన్నంగా తాజాగా ఆమెలో వచ్చిన మార్పు వెనుక లెక్కలు చాలానే ఉన్నట్లు చెప్పాలి. మొన్నటి వరకు తండ్రిని తప్పించి అందరిని టార్గెట్ చేసిన ఆమె.. ఇప్పుడు అన్నను కూడా ఆ జాబితాలో చేర్చటం చూస్తుంటే.. ఆమె తన లక్ష్యాన్ని ఎవరికి ఎక్కు పెట్టాలన్న దానిపై పక్కా ప్లానింగ్ తో ఉన్నారని చెప్పాలి. ఏమైనా.. తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్ కు.. మీ చుట్టు కుట్ర జరుగుతోంది నాన్నోరు అంటూ కవిత చెప్పటమే అసలు సిసలు కామెడీగా చెప్పాలి.