పాడు కాలం.. పోయే కాలం.. అన్నట్లుగా ఇటీవల వెలుగు చూస్తున్న దారుణాలు ఉంటున్నాయి. అదనపు సుఖాల కోసం.. పాడు పైసల కోసం కుటుంబ బంధాల్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్న కర్కస మనస్కులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది. భర్త లేని భార్యలకు ఫించను డబ్బులు ఇచ్చే ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రయోజనాన్ని సొంతం చేసుకునేందుకు కట్టుకున్న భర్తను హతమార్చిన దారుణ ఉదంతం కర్ణాటకలో చోటుచేసుకుంది.
భర్త చనిపోతే ఫించను పైసలు వస్తాయన్న ఆలోచనతో కట్టుకున్నోడ్ని తుదముట్టించిన భార్య ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. మైసూర్ జిల్లా హుణసూరు తాలూకా పరిధిలోని చిక్కహెజ్జూరుకు చెందిన 54 ఏళ్ల వెంకటస్వామిని అతని భార్య సల్లాపురి హత్య చేసింది. విషాహారాన్ని భర్తకు పెట్టి.. అతన్ని హత్య చేసిన ఆమె.. ఊరికి శివారులో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. భర్త డెడ్ బాడీని పెంటకుప్పలో పడేసింది. తన భర్త కనిపించకుండా పోయాడని.. పొలానికి వెళ్లిన పెద్ద మనిషి ఇంటికి రాలేదంటూ విలపించసాగింది. పొలానికి వెళ్లిన సమయంలో తన భర్తను పులి లాక్కొని వెళ్లి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. పోలీసుస్టేషన్ లో కంప్లైంట్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సల్లాపురి పేర్కొన్నట్లుగా అటువైపు పులి వచ్చిన దాఖలాలు లేకపోవటంతో గ్రామస్తులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చివరకు పెంటకుప్పలో కుళ్లిన స్థితిలో వెంకటస్వామి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అతని ఒంటి రంగు మారి ఉండటంతో అనుమానించారు. పోస్టుమార్టం పరీక్షలకు పంపిన పోలీసులు.. అనుమానంతో సల్లాపురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. చివరకు పోలీసుల ప్రశ్నలకు ఆమె దొరికిపోయారు. తానే విషాహారాన్ని పెట్టి హత్య చేసినట్లు ఒప్పుకుంది. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని లాక్కొని పడేశానని.. వన్యప్రాణుల దాడిలో మరణిస్తే.. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున పరిహారం వస్తుందని.. పింఛను వస్తుందన్న ఆమె మాటలకు షాక్ తినటం అధికారులు వంతైంది.


















