భారతదేశంలోని కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ.. యెమెన్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమెకు ఇప్పటికే ఉరి శిక్ష అమలైపోవాల్సినా.. అదృష్టం కొద్దీ అది కాస్తా పలు ప్రయత్నాల వల్ల వాయిదా పడింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈమె కేసుకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ రావడం లేదనే చర్చ మొదలైన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది.
అవును… యెమెన్ జాతీయుడిని హత్య చేసినందుకు ఆ దేశంలోని న్యాయస్థానం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ శిక్ష అమలు వాయిదా పడింది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టులో వెళ్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం… ఆ శిక్ష అమలుపై స్టే కొనసాగుతోందని, తీవ్ర పరిణామాలు ఏమీ జరగలేదని తెలిపింది.
వివరాళ్లోకి వెళ్తే… యెమెన్ లో మరణశిక్ష పడిన నిమిష ప్రియను కాపాడేందుకు కేంద్రం దౌత్య మార్గాలను ఉపయోగించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను విచారిస్తోన్న సుప్రీంకోర్టు.. ఆమె మరణశిక్ష గురించి ప్రశ్నించింది. ఈ సందర్భంగా.. ఆమెకు చట్టపరమైన సహకారం అందిస్తోన్న ‘సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ తరఫు న్యాయవాది స్పందించారు.
ఇందులో భాగంగా… శిక్ష అమలుపై స్టే కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి స్పందిస్తూ… ప్రస్తుతం ఈ కేసులోకి కొత్త మధ్యవర్తి వచ్చారని.. ఇప్పటివరకు మంచి విషయం ఏంటంటే, తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకోకపోవడమే అని వెల్లడించారు. ఈ వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కేసును జనవరికి వాయిదా వేసింది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ.. నర్సు కోర్సు పూర్తి చేశారు. అనంతరం 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో.. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఈ సమయంలో… అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు.
దీనికి ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష ప్రియ – థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొన్నారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేయగా… నిమిష మాత్రం యెమెన్ లోనే ఉంటూ ఆ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను కొనసాగించారు.
ఈ సమయంలో నిమిష ప్రియను తన భార్యగా పేర్కొంటూ మెహది వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు! ఈ క్రమంలో ఆమె పాస్ పోర్టు లాక్కొన్నాడు. దీంతో.. అతడిపై 2016లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోలేదట! ఈ క్రమంలో.. 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి తన పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది.
అయితే.. ఆ మత్తు మందు మోతాదు కాస్తా ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. దీంతో ఆమె మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పడేసింది. అనంతరం అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడగా.. ఆ శిక్షను ఈ ఏడాది జూలై 16న అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. నాటి నుంచి పలు కారణాలతో ఈ శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది!