జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్.. ఉప ఎన్నికల్లో సిటింగ్ స్థానాన్ని కాపాడుకోలేని దయనీయస్థితికి ఎందుకు చేరుకుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఆ పార్టీ స్వయంకృతమా? అనే చర్చకు కారణమవుతోంది. సానుభూతితో సొంతం చేసుకోవాల్సిన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ద్వారా చేజేతులా ఓటమిమి మూటగట్టుకోవాల్సి వచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుకు రెఫరెండంగా ప్రకటించడమే కాకుండా, ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సివస్తుందన్న ప్రచారం చేయడంతోనే బీఆర్ఎస్ ఎక్కువ నష్టపోయినట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
తాజా ఓటమితో సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి ఉందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. కొద్ది రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోల్ కూడా బీఆర్ఎస్ కు సవాల్ గా మారే అవకాశం ఉందంటున్నారు. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఇంతవరకు మళ్లీ గెలవలేదు. సరికదా.. చేతిలో ఉన్న రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పాల్సిన పరిస్థితులను తెచ్చుకుందని అంటున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ హైకమాండ్ వ్యవహరించిన తీరే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గౌరవించే విషయంలో బీఆర్ఎస్ జీర్ణించుకోలేని విధంగా నడుచుకుంటోందని, దీంతో సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేలా.. కసితో పనిచేసేలా చేస్తోందని అంటున్నారు.
నిజానికి బీఆర్ఎస్ సున్నితంగా వ్యవహరిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు. బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని రాజకీయం చేయకుండా సావదానంగా సంప్రదింపులు జరిపితే కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోకుండా వదిలేసేదని, కానీ, గోపీనాథ్ మరణించిన నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతామన్నట్లు బీఆర్ఎస్ పెద్దలు నడుచుకోవడంతోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని అంటున్నారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ చివరి రోజుకు వచ్చేసరికి అలసిపోవడం కూడా ఓటమికి కారణంగా చెబుతున్నారు.
ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తుత దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ద్వారా గులాబీ దళం మళ్లీ మళ్లీ ఎదురుదెబ్బలు తినాల్సివస్తోందని అంటున్నారు. సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని కెలికి అరెస్టు చేయంచడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిణామంలోనూ రేవంత్ రెడ్డి ఎదుగుదలకు బీఆర్ఎస్ అధిష్టానం పాత్ర స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పోటీ చేస్తున్నారనే భావన కల్పించి బీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకుందని అంటున్నారు. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెలికి.. ఆయన గల్లీగల్లీలా తిరిగేలా చేసిందని, దీనివల్ల జూబ్లీహిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం.. తన పవర్ చూపించారని అంటున్నారు.


















