హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుని, ఆదివారం నవంబర్ 9 సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మైకులు, ర్యాలీలు, రథాలు మూగబోనున్నాయి.. చివరి రోజున ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ ప్రాభవాన్ని, పట్టుదలను ప్రదర్శిస్తూ మాటల తూటాలతో ప్రత్యర్థులపై దండయాత్ర చేశాయి. పార్టీల నాయకులు ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనితో ప్రచారం పీక్‌కు చేరింది.
పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, అభ్యర్థులు ఓటర్లను వ్యక్తిగతంగా చేరుకోవడానికి ప్రయత్నించారు. అభివృద్ధి వాగ్దానాలు, స్థానిక సమస్యల పరిష్కార హామీలు ప్రచారంలో ప్రధానాంశాలుగా నిలిచాయి. అధికార కాంగ్రెస్ గెలిచి తీరాలని, బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, బీజేపీ ఇక్కడ సత్తా చాటి రాష్ట్రంలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రచారం ఈరోజు ముగియనుండడంతో అసలు ఆట మొదలు కాబోతోంది. పార్టీలన్నీ ఓటర్లకు తాయిలాలు పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసులు కూడా ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రచార సమయం ముగిసిన వెంటనే ఎన్నికల కోడ్ మరింత కఠినంగా అమలు కానుంది. పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ షాపులు, బార్‌లు మూసివేయబడతాయి. ప్రచారం ముగిసినప్పటికీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే అధిక ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఏపీ నుంచి వచ్చినవారు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే, అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నియోజకవర్గంలో అనేక హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న చాలామంది ఏపీ వ్యక్తులు బెట్టింగ్‌ల కోసమే ఇక్కడికి వచ్చారని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ ఓడిపోతుంది.. గెలిచే అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత విజయావకాశాలపై ప్రధానంగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయని అంటున్నారు. ఓ అంచనా ప్రకారం ఈ ఉప ఎన్నికలపై దాదాపు ₹300 కోట్ల నుంచి ₹400 కోట్ల వరకు బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రత్యేక ముఠాగా ఏర్పడి, ఎప్పటికప్పుడు సర్వే చేయించుకుని, దాని ఆధారంగా బెట్టింగుల వ్యవహారాన్ని నడుపుతున్నట్లు సమాచారం.
నవంబర్ 9 (ఆదివారం) సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. రెండు రోజుల తర్వాత నవంబర్ 11 (మంగళవారం)న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసింది. ప్రచారం ముగియడం, బెట్టింగ్‌ల జోరు నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


















