ఇటీవల కాలంలో రేవంత్ కు హస్తిన లోని హైకమాండ్ నుంచి తగిన మద్దతు లేదని.. రాహుల్ తో రేవంత్ కు అనుబంధం కాస్త సన్నగిల్లిందని రాజకీయ వ్యతిరేకులు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తాను సాధించిన విజయాన్ని హస్తినకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి.. రాహుల్ ని కలిసి, చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగిన విషయం.. ఆ ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చిందని అంటున్నారు.
అవును… బల్దియా ఎన్నికలకు ముందు అత్యంత కీలకంగా భావించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. నవీన్ ని అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో సుమారు 51 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా.. ప్రతిపక్ష బీఆరెస్స్ కు 38 శాతం, బీజేపీకి 8 శాతం వచ్చాయని అన్నారు. తద్వారా తమ రెండేళ్ల పాలనను ప్రజలు పరిశీలించినట్లు అర్ధమవుతుందని.. జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలో నవీన్ ను హస్తినకు తీసుకెళ్లారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన కొన్ని గంటల్లోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా… నవీన్ విజయాన్ని హైకమాండ్ ముందు రేవంత్ సగర్వంగా ప్రకటించి, ప్రదర్శించినట్లు తెలుస్తోంది! ఈ నేపథ్యంలో మరోసారి రేవంత్ కు హైకమాండ్ వద్ద మరిన్ని మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు.
ఈ సందర్భంగా… రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ ను అటు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ టీం తో ఫోటోలు దిగారు.
కాగా… హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ, సరికొత్త వ్యూహాలు రచిస్తూ, అటు మంత్రులను, ఇటు పార్టీ నాయకులను సిద్ధం చేస్తూ కాంగ్రెస్ ను ఘన విజయం వైపు నడిపించారు రేవంత్ రెడ్డి. సాధారణ ఎన్నికల తర్వాత గ్రేటర్ పరిధిలో జరిగిన రెండు స్థానాల్లోని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో… తాజా ఉప ఎన్నిక ఫలితం సీఎం రేవంత్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసినందే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది!


















