జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇపుడు తెలంగాణా రాజకీయాలను హీటెక్కిస్తోంది. చూడడానికి ఒక చిన్న ఉప ఎన్నికగా ఉన్నా దీని ప్రభావం చాలా పెద్దదిగా ఉండబోతోంది. దానికి కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు దగ్గర అవుతోంది. దాంతో అధికార పార్టీ మీద జనాభిప్రాయాన్ని ఈ ఉప ఎన్నిక తెలియచేస్తుందని అంటున్నారు అంతే కాదు ఈ ఎన్నిక ఫలితం బట్టి త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు కూడా ఆధారపడి ఉన్నాయి. అందుకే అధికార కాంగ్రెస్ ఆచీ తూచీ వ్యవహరిస్తోంది.
ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధిని కాంగ్రెస్ జాతీయ అధినాయకత్వం ఖరారు చేసింది. నవీన్ యాదవ్ ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సీటు నుంచి పోటీ చేసే వారి జాబితాలో అనేక మంది పేర్లు అయితే ఇంతకాలం ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది పెద్దలు బిగ్ షాట్స్ కూడా ఈ సీటు కోసం పోటీ పడ్డారు అయితే నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేయడం ద్వారా ఆ ఉత్కంఠకు కాంగ్రెస్ పెద్దలు తెర దించేశారు.
నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత. ఆయన బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. జూబ్లీ హిల్స్ లో వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అంతే కాదు ముస్లిం సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటారు. దాంతో ముస్లిం యాదవ్ సామాజిక వర్గాల మధ్య మంచి అనుబంధం ఇక్కడ ఉంది. ఈ కాంబినేషన్ ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ఎంపిక చేసింది అని అంటున్నారు. 2014, 2018 లలో పోటీ చేసి గణనీయమైన ఓట్లను తెచ్చుకున్న నవీన్ యాదవ్ యువ నేతగా విద్యార్ధి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయనకు బలమైన సామాజిక వర్గాల మద్దతు పూర్తిగా ఉంది.
ఇక చూస్తే మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వం మీదనే దృష్టి పెట్టారు అని ప్రచారం సాగుతూ వచ్చింది కొత్త ముఖాన్ని ఈసారి పరిచయం చేయడమే కాకుండా లోకల్ గా మంచి పట్టు ఉన్న యువ నేతకు చాన్స్ ఇస్తే కచ్చితంగా బంపర్ విక్టరీ కొట్టవచ్చు అన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. అందుకే అజారుద్దీన్ సహా చాలా మంది ఈ సీటు మీద ఆసక్తి చూపించినా రేవంత్ రెడ్డి మాత్రం నవీన్ యాదవ్ మీదనే ఫోకస్ పెట్టారని చివరికి ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయింది అని అంటున్నారు.
ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో బీఆర్ ఎస్ తన అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ సతీమణి సునీతను ప్రకటించింది. బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది. దాంతో త్రిముఖ పోరు అయితే కచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ మజ్లిస్ ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు, మజ్లీస్ అయితే కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందని అంటున్నారు. టీడీపీకి కూడా గణనీయంగా ఓట్లు ఉన్నాయి. అవి ఎవరికి పడతాయో చూడాల్సి ఉంది.