హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌గా పేరొందిన గచ్చిబౌలిలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. “ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్” పేరుతో నడుస్తున్న ఈ సంస్థ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. ఈ ఘటనలో సుమారు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉద్యోగం చేయాలనీ వారి కలలు ఆశలు చిదిమేసిన ఈ సంఘటన ఐటీ రంగంలో కలకలం రేపింది.
ప్యూరోపాల్ క్రియేషన్స్ కంపెనీ, ఉద్యోగాలు కల్పిస్తామని, శిక్షణ అనంతరం నియామక పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలతో ఆకర్షితులైన నిరుద్యోగ యువతీ యువకులు, ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున చెల్లించారు. కంపెనీ రెండు నెలల పాటు శిక్షణ పేరుతో కాలం గడిపిన తర్వాత.. ఉన్నట్టుండి కార్యాలయాన్ని మూసివేసి, బోర్డు తిప్పేసింది.
బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంపెనీ నిర్వాహకుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అయితే, నిర్వాహకులు ఇప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, పరారీలో ఉన్నట్లు సమాచారం.