అవినీతి- ఎందెందు వెతికినా అందందు దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా మారి చాన్నాళ్లయ్యింది. పనుల కోసం ప్రజల సొమ్మును గుటకాయ స్వాహా చేస్తున్న విషపురుగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడీ లిస్ట్‌లో మరో అవినీతి అనకొండ చేరిపోయింది. మరి ఎవరా కేటుగాడు…? ఏంటా కహానీ…?అవినీతికి ఆకలెక్కువ అని విన్నాం కానీ… ఈ రేంజ్ ఆకలి ఉంటుందని ఇతగాడిని చూస్తేనే అర్థమవుతుంది…! పేరు జీవన్‌లాల్… వృత్తి ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్. కానీ ఆయన ఇన్‌కమ్‌ని పెంచుకోవడం కోసం ఎత్తిన కమీషనర్ అవతారం ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఇతని బేరాలు, దందాలు, బినామీ ఆస్తులు చూస్తుంటే ఎవ్వరైనా బిత్తరపోవాల్సిందే…! మందిని ముంచే తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కొడుకే ఈ జీవన్‌లాల్. ఇటీవల ముంబయిలో 70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడీ కేటుగాడు. ఇక ఇన్నాళ్లు ఇతగాడి చేసిన కలెక్షన్స్ చూసి సీబీఐ అధికారులే షాక్ అవుతున్నారు. ముంబయికి చెందిన NDW డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 2.5కోట్ల విలువైన ప్లాట్‌ను లంచంగా తీసుకున్నాడీ అవినీతి తిమింగళం. అంతేకాదు ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్ వెంకటేశ్వరుల పేరిట ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముంబయిలోని మరో రెండు సంస్థల నుంచి కూడా 35 లక్షలు లంచం తీసుకున్నట్లు సీబీఐ తేల్చింది. ఈ సొమ్మును హవాలా ద్వారా స్వీకరించినట్లు దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది.
షాపూర్‌జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ట్యాక్సేషన్ ఫైల్ పెండింగ్‌ను క్లియర్ చేసేందుకు 1.20 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐకి దృష్టికి వచ్చింది. ఇక ఇద్దరు మధ్యవర్తుల ద్వారా 15 లక్షలు లంచం తీసుకున్న జీవన్ లాల్.. మరో 70 లక్షలు తీసుకుంటుండగా పక్కా ఆధారాలతో సీబీఐ అధికారులకు దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో మొత్తం 15 మందిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. లంచం ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చారు. మొత్తంగా.. జీవన్‌లాల్ అవినీతి లీల ఇప్పుడు యావత్ సివిల్ సర్వెంట్లకే మచ్చ తెస్తోంది.